పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/730

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

834

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

"వేంకటశాస్త్రి అబద్ధ మాడుచున్నాఁడు, కృతఘ్నుఁడు” అని లోకులకుఁ దెలియఁ జేయుటయే శ్రీవారికి, తాత్కాలిముగాఁ దోఁచిన యూహ. ఇట్లే ఏ విశ్వకర్మ శిష్యునివద్దనో, యెప్పుడో, మఱికొన్ని అపోహలు కూడ కల్పి, జాఱవిడిచినారు. ఆ హరికథకుఁడు (విశ్వకర్మ) హైదరాబాదులో ఈ యంశములను నల్వురయెదుటఁ బడవేసినాఁడు. దానితో లంక యంటుకొన్నది. ఆ పట్టణస్థులు మొదటికే నమ్మక నాకుత్తరము వ్రాసినారు. నేను శిష్యత్వము నిజమని సూత్రప్రాయముగా జవాబిచ్చినాను. శ్రీవారిచ్చిన జవాబు నుదాహరించియే యున్నాను.

వీరిట్లు హైదరాబాదువారికి జవా బిచ్చుటలోనే కాక వేఱొకచోఁ గూడ నిట్లే లిఖించినారు. తిలకింపుఁడు.

(శ్రీవారి “దురుద్ధరదోషశృంఖలము" అనెడి పుస్తక పీఠిక నుండి)

"చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు.......... వీరు కొంతకాలము నా యొద్ద విద్యాభ్యాసము చేసినారని లోక మనుకొనుచున్నది. వీరు గీరతమను నొక మహాగ్రంథమును రచించినారు. అందు నొక్కింత నాయొద్ద చదివితినని వ్రాసినారు. నేను మాత్రమెటగాని యిది యిట్టిదని వ్రాసిగాని చెప్పిగాని యెఱుఁగను, నిశ్చయము, ఇందువలననాకు రాcబోవు గౌరవములేదు............”

పై వాక్యములు గురువుగారెట్టి కోపముతో నుండి వ్రాసినదియు వ్యక్తపఱచెడినిగదా? ఆ యుత్తరము గురువుగారు వ్రాయనేలేదేమో, అందలి మాటలు విశ్వబ్రాహ్మ శిష్యునితో ప్రసంగింపనేలేదేమో, అనుకొందమన్న ఈ శృంఖలపీఠికలోని మాటలు పైవానిని బలపఱచుచున్నవిగదా! అగుచో శ్రీ శాస్త్రులవారు పలుచోట్ల "వేంకటశాస్త్రి నా యొద్ద కుమారసంభవము మొదలు మాఘము వఱకుఁగాని, లేక నైషధమువఱకుఁ గాని, చదివి యుండి అవధానాభ్యాస మొనరించి కూడ, అన్యథగా చెప్పుచున్నాఁ" డని ప్రసంగించి యుండవలెను, అని తేలుచున్నది. దీనికి శ్రీ గాదె జగన్నాథస్వామిగారి పద్య మొకటి అనుకూలించుట లేదు. చూడుఁడు .

(గురుదక్షిణ 59వ పుట నుండి)

ఉ. శ్రీపదకృష్ణమూర్తికవిశేఖరు సన్నిధి మీగురుండు వి
    ద్యాపఠనంబు చేసినది యారయ మాసచతుష్క మయ్యు సం
    దీపితబుద్ధి నాతనిని దేశికుఁడంచును చెప్పుచుండు "నే
    నేపగిదిన్ గురుండగుదు నీతని” కంచు వచించు నాతఁడున్.