పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/728

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

832

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వని శంక రావచ్చును. ఈ శంక కేమి? చొప్పదంటుశంక. చదివినవే పాఠము చెప్పి చదువనివి చెప్పలేనిచో వాఁడుపాధ్యాయుఁడేకాఁడు. చదివినను చదువకున్నను, నేను మాఘకావ్యము మొదలువెట్టినది పిల్లంకలో శ్రీ సుదర్శనం అనంతాచార్యుల వారివద్ద ననునది ముఖ్యాంశము. వీరు నా కెన్నవ గురువులు? స్థూలదృష్టిని గ్రామముల లెక్క ప్రకారము, (1) కాపులపాలెము, (2) కాటవరము, (3) కాజులూరు, (4) చామర్లకోట, (5) పిల్లంక ఈ రీతిని అయిదవగురువుగారు, రెండవ గురువుగారు కాటవరపు గురువుగారు, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రులవారు. వీరెట్లు వ్రాయుచున్నారో తిలకింపుఁడు :

26-9-32 రాజమండ్రి.

"శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారి విషయము తెచ్చినారు. ఆసంగతి వ్రాయనాకిష్టములేదు. అయినను మీరడిగితిరి కావున చెప్పెదను. అతఁడు కుమారసంభవము మొదలు మాఘము వఱకు కావ్యములు నావద్దనే చదివినాడు. తెలుగు కవిత్వము, అవధానాభ్యాసము నా యొద్దనే జరిగినది. ఇది ఎందుకడిగినారో నాకు తెలియదు. ఇంతకన్న విశేషము వ్రాయదలఁపను......."

ఇది శ్రీశాస్త్రులవారు “నేను వారి శిష్యుఁడనేకా'నని సంశయించుచు నొకరు వారి పేర వ్రాసిన యుత్తరమున కిచ్చినజవాబు. ఏయూరికి? హైదరాబాదుకు. ఇందులో స్పష్టముగా మాఘ కావ్యము వఱకు చదివినట్లు వ్రాయుచున్నారు. నా యొద్దనే అని యేవకారార్థఘటితముగా లిఖించినారు. నా వ్రాఁతయేమో పైని చూపితిని. వీరి వ్రాఁతయే నిజమగుచో కాజులూరిలోఁగాని చామర్లకోటలోఁగాని పల్లెపాలెములోఁగాని పిల్లంకలోఁగాని వేంకటశాస్త్రి అలంకార విద్యార్థిగా నుండుటయేకాని, చదువనే లేదని తేలును. లేదా, విద్యార్థిగా నాగ్రామములకు వెళ్లనేలేదని యేని తేలును. అగుచో, చరిత్ర గ్రంథమగు జాతక చర్యలో ఆ యీ గురువుల నామధేయము లేల యెత్తవలెను? వారి శుశ్రూష నేల యుదాహరించవలెను? అనునది చదువరులు విచారించుకోవలసి యుండును. శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రులవారి యొద్ద చదివిన విద్యలో కొంతభాగమును, యితర గురువులకు కట్టి పెట్టుటవలన వేంకటశాస్త్రికిఁ గలిగిన ఫలమేమో విచారింపవలసి యుండును. ఇది యిటులుండె. ఈ మాఘాంతపు చదువొకప్పుడు నైషధాంతము వరకును డేcకినది. చూడుఁడు. "దయమీఱ నైషధాంతము కావ్యములు చెప్పి" ఈపై నుదాహరించిన సీసపాదము శిష్యులు, వెంకట రామకృష్ణుల వివాదములో, వెం.రా. లపక్షమున నుదాహరింపఁబడినది. పై సీసములో ఇప్పుడు శ్రీశాస్త్రులవారు హైదరాబాదులో నొకరిపేర వ్రాసిన యుత్తరములోని అవధానాభ్యాసాదులు గూడ నున్నట్లు జ్ఞాపకము. అపుడీ