పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/727

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీపాదగురువులకడ నా శుశ్రూష

831


తే.గీ. అచటి కప్పుడప్పుడరిగి భారవికావ్యమందు
      తక్కుసర్గ లయ్యనఘుని యొద్దఁ జదువుచుండు....

తక్కువ సర్గలనఁగా చామర్లకోటలో చదివిన మూఁడు సర్గలును గాక మఱి రెండుసర్గలని వ్యాఖ్యానము చేసికోవలెను. అంతియకాని భారవి కావ్యము సర్వమునని తాత్పర్యముకాదు. పంచకావ్యములలో నెవరుగాని యేకావ్యమునుగాని (మేఘసందేశము తప్ప) పూర్తిగాచదువరు. ఇది సంప్రదాయజ్ఞు లెల్లరును నెఱిఁగినదే కాన విస్తరింపఁ బనిలేదు. నాకు మాత్రము మేఘసందేశము కూడ సగమనఁగా, ఉత్తరమేఘ మప్పటికే కాక యిప్పటికిని తరువాయియే. అది యుటులుండె. ఇప్పటికి నాకు మాఘము చదువవలసియే యున్నదనునది ప్రస్తుతము. లఘుకౌముది పిల్లంక గ్రామములో అనంతాచార్యులవారి యొద్దను, భారవి తరువాయి పల్లెపాలెములో సూరయ్యగారి యొద్దను చదువుచున్నట్లు తేలినది.

(జాతకచర్య పూర్వార్ధము నుండియే)

తే. ఇట్టులొక మూఁడు మాసమ్ము లింటనుండి, భారవిసమాప్తి
    నొనరించెఁ బఠనసేయ ! మొదలిడియె మాఘము.........

ఈ మాఘము మొదలిడితిననియే వ్రాసితినిగాని, పైనుదాహరించిన యిరువురు గురువులలో నెవరియొద్దనో వ్రాయలేదు. ప్రకరణమును బట్టి కావ్యపాఠము పల్లెపాలెములో చదువుచున్నట్లుండుటచే, సూరయ్యగారి వద్ద ననుకోవచ్చును. కాని అట్లుకాదు, పిల్లంక అనంతాచార్యులవారి యొద్దనే ఇఁక నొక విశేషము. అప్పుడిప్పటివలె, పుస్తకములు సులభముగా లభించెడివికావు. ఆకారణమున సప్తమసర్గ దగ్గఱనుండియున్న మాఘకావ్యము ఆయాచార్యులవారి యొద్ద నుండఁగా, "రొట్టెకు రేవేమిట” అని, ఆ సర్గమునే మొదలు పెట్టినారు. ఏకొన్ని శ్లోకములో అగునప్పటికి, చామర్లకోట చదువునకు విఘ్నము కల్పించిన కంటిజబ్బు మరింత హెచ్చి విఘ్నము నాపాదించినది. అంతతో ఆచదువు ముగిసినది. పిమ్మట చరిత్రము శ్రీ బ్రహ్మయ్యశాస్త్రులవారి సందర్శనమున కేగుట లోనగు విషయములు ప్రస్తుతములు గావు. ఇంతకును నేను మాఘము బ్రహ్యయ్యశాస్త్రులవారి సన్నిధికి వెళ్లుట కించుక పూర్వము మొదలుపెట్టి నట్లును, ఆ మొదలు పెట్టుటయేని మొదటినుండి కాదనియు, మొదటి నుండి కాకపోయినను మొదలిడిన సర్గము దగ్గఱ నుండియేని జరుగక విఘ్నమువచ్చిన దనియు, చదువరు లరయవలయును. దీనిచేత మేఘసందేశములోని ఉత్తరభాగమువలెనే నాకు మాఘకావ్యము కూడ నిప్పటికి గురు ముఖమున చదువని పొత్తముల లోనిది యేయని తేలును. అగుచో "నీ విటీవల నివి పాఠము లెట్లు చెప్పితి"