పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/725

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీపాదగురువులకడ నా శుశ్రూష

829



(జాతకచర్య పూర్వార్ధము నుండి)

తే.గీ. “అంత మేఘసందేశ కావ్యమును మొదలు, వెట్టి చదు
       వుచునుండంగ విఘ్నకారణం బుదయమందె...."

చ. “... గురు నింతి మృతింగనె, ఆత్మదేహమం
    దొదవె నొకించుకంత జ్వరయోగము.......ఇంటి కే
    గెద నని పేర్మినగ్గురునికిన్ వచియించి... చనెఁ దల్లినిదండ్రినింగనన్.

కాటవరములో మేఘసందేశమును మొదలు పెట్టి చదువుచున్నట్లును, అంతలో విఘ్నము వచ్చినట్లును తేలునుగాని, యెంతవఱకా మేఘసందేశము చదివినదియు తేలదు. తేలక పోవఁగాక, మాఘకావ్యము చదువుచున్నట్లు మాత్రము స్ఫురింపదు. చదువరు లీమాఘకావ్యము మాట మన మందుంచికొని పదంపడి విషయము చిత్తగింపుఁడు. నాజ్ఞప్తిని బట్టి కాటవరములో మేఘ సందేశ ప్రథమసర్గములో "శ్లో. వేణీభూతప్రతను సలిలా” అను శ్లోకము వఱకును అయినట్లిప్పటికిని చెప్పఁగలను. ఈకాకదంతపరీక్ష యిదివఱలో నవసరము కామింజేసిగాని, యీ మాట యిదివఱకే వ్రాసియుందును. ఏమయిన నేమి? మేఘసందేశము శ్రీకృష్ణమూర్తి శాస్త్రులవారి వద్ద నారంభించి, ప్రథమసర్గము కొంత, అనఁగా 63 శ్లోకములలో 29 శ్లోకముల వఱకు మాత్రము, చదివి, విఘ్నమురాఁగా, ఆయూరువదలి యింటికి వచ్చిన పిమ్మట, తక్కిన మేఘసందేశపు మొదటి సర్గపు తరువాయి కాజులూరులోఁ జదివినట్లును, (ఈ చదువును గూర్చి జాతకచర్య చూడఁదగు) ఆ స్థితిలో చామర్లకోట శిష్యత్వ మారంభమైనట్లును తేలినది. చామర్లకోటలో చదివిన దేకావ్యము? అని ఆకాంక్ష కలుగుచున్నది. క్రమప్రకారము మేఘసందేశములోని తరువాయి చదువవలెను. కాని అట్లు జరగలేదు. ఆచార్యులవారు నాకు భారవి కావ్యమును, లఘుకౌముదిని మొదలుపెట్టినారు. ఈ విషయము నెఱిఁగినవారిలో, చామర్లకోటలో పలువు రుందురేమోకాని, ఉన్నను నా విద్యార్ధిత్వమును వారు చెప్పఁగల రేమోకాని సుమారేబదియేండ్లనాఁటి విషయ మగుటచే నే నే కావ్యము లటఁ జదివితినో చెప్పఁజాలరను కొందును. కాని యీ విషయ మంతో యింతో బ్ర||శ్రీ|| కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రురులవారి తమ్ములును, సుప్రసిద్దులును, పండితులును, వయస్సులో నించుమించు నాతోడివారును, చామర్లకోట శిష్యత్వమునెడల, నాతో నేకగురుకులును, లఘుకౌముది సంజ్ఞాప్రకరణములో ఆరంభదినములలో నాకు చింతన చెప్పినవారును నగు సుబ్బయశాస్త్రులవారు నేనచట భారవికావ్యమును, లఘుకౌముదియు మొదలిడి చదివిన యంశమును జెప్పఁగలుగుదురేమో యనుకొని వారిసాక్ష్యము నాసించుచున్నాను.