పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/723

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



827



శ్రీపాదగురువులకడ నా శుశ్రూష

(9-11-1935 సం||ర కృష్ణాపత్రిక నుండి)

సీ. రఘువంశము భుజంగరాడ్గురు సన్నిధి
              నింపుమీఱఁగఁ బఠియించినాఁడ
    శ్రీపాదకృష్ణమూర్తి కవీంద్రుకడ నైదు
              మాసముల్ శుశ్రూష చేసినాఁడ
    కాజులూరను నూరఁగామసోముల యొద్ద
              నొకమూఁడుమాసమ్ము లున్నవాఁడ
    చామర్లకోటలోఁ జదివితి రాఘవా
              చార్యసన్నిధిని మాసత్రయమ్ము

తే.గీ. పై ననంతార్య సూరయ పండితు లిరు
      వురును మూఁడు మాసమ్ములు గురువులైరి
      పిదప శ్రీబ్రహ్మయమనీషి పేరు దెచ్చు
      గురుఁడు నాకయ్యెఁ దన కట్టి గురుఁడ నేను.

ఇట్లు ప్రసంగవశమున గీరతప్రథమభాగములో నా కావ్యగురువులను గూర్చియు, వ్యాకరణశాస్త్ర గురువును గూర్చియు సంగ్రహముగాఁ జెప్పికొనియుంటిని. ఇందు శ్రీభుజంగరావు పంతులవారి సన్నిధిని జదివినది రఘువంశమని తెలియుచునే యున్నదిగాని, యెంతకాలము చదివినదియు "నా గురుపరంపర" అనే వ్యాసములో వివరించితిని. దాని నిట నుదాహరించెదను. "ఇతర విద్య లప్రధానంగా, కావ్యాలు ప్రధానంగా యేలాగైతేనేమి రెండేండ్లలో, మూడుసర్గలు రఘువంశం చదవడం అయింది." (నవంబరు 10వ తేదీ 1934 సం|| కృష్ణ చూ.) ఇఁక రెండవ చరణములోని గురువుగారి యొద్ద చదివిన దానికి తపిసీలు తెల్పవలసి యున్నది. దీనిని గూర్చియే యీ వ్యాసము బయలు వెడలుచున్నది. కావున, ఈ వివరణము తుట్టతుదిని చేయుదును. మూఁడవ చరణములోని కాజులూరి గురువులను గూర్చి -