పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/719

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

823


సమయముకాదని మనవి చేయుచున్నాఁడను. మఱియును వీరు మా గురువుగారికిఁ బ్రసిద్దులైన యేశాస్త్రజ్ఞుల పంక్తి యందుఁగాని స్థానమే లేదనిరి. ఏమీ? వ్యాసకృత మహాభారతమును బ్రత్యక్షరమును బరిశీలించి తెలిఁగించిన మహాకవికి సర్వశాస్త్ర మర్మములును నవగతము లగునే? అట్టి స్థితిలో నిట్లు లిఖించుట కర్థమేమో! గురుశుశ్రూషా పూర్వకముగ శాస్త్రాభ్యాసము చేయవలయుననియా? అగుచో "తదధీతే, తద్వేద" అను సూత్రమునందలి రెండవ వాక్యమునకుఁ జారితార్థ్యం బెచ్చట? భవతు, నేనిపుడు వీరి వ్రాఁతలనెల్ల విమర్శింపఁ బూనను. వీరు తుట్టతుదను దిక్కన్నగారి భారతమునకును మా గురువుగారి భారతమునకును, బంగారు తీఁగెలకును, ఇనుప తీఁగెలకును నున్నయంత తారతమ్యము కలదని వ్రాయఁగల్గిరి. ఈ మాట యెంత సత్యమైనను దీనిని ఖండింపఁబూనుట మిక్కిలి కష్టము. మానవమాత్రు లందఱకును తిక్కన్నగారి యందభిమానము. మా గురువులయందో, యే కొలఁది మందికో యుండిన నుండవచ్చునుగాని సార్వజనీనము గాదు. అట్టి స్థితిలో దీని ఖండనమున కుపక్రమించి బయలఁబడుట యెట్లు? నరసింహశాస్త్రులవారేదో భగదత్త వైష్ణవాస్త్రఘట్టము నెత్తికొని తమవాదమున కుదాహరణముగాఁ జూపిరి. అది నిస్సందిగ్ధముగా నట్టిదియే కావచ్చును. కాని వేరొక ఘట్టమును దీసి ప్రయత్నపూర్వకముగా విమర్శింపఁబూనినచో, నది యిదియు నిది యదియునుగా మాఱునని శాస్త్రులవారు యోజింపనే లేదు. ఇట్టి ప్రసక్తిసుమారు 10 సంవత్సరములనాఁడు వచ్చినది, ఆ ఘట్ట మేదియో నేనిపుడు మనవి జేయఁజాలను గాని యపుడు జరిగిన తద్విషయక సభకు నేనే అధ్యక్షుఁడుగా నుండి మా గురువుగారి భారతమే సర్వోత్కృష్టమని పలువురు విజ్ఞుల యెదుట నుపన్యసించి జయము గాంచితిని. కాఁబట్టి నరసింహ శాస్త్రులవారి వాక్యమునకు "ఉదితానుదిత హోమమునకుంబలె" వైకల్పికత్వ మాపాతతస్సిద్ధమని నాయభిప్రాయము. ఇంకొకటి. ఎక్కువ చోట్లు తిక్కన్నగారివి బంగారు తీఁగెలు కావచ్చును. ఏ కొన్నిచోట్లు మాత్రమో, ఇనుప తీఁగెలు కావచ్చును. మా గురువుగారివో, తద్వ్యత్యయముగా నైనఁగావచ్చును. అంతియ కాని, “సర్వమును తోఁటకూర కట్టగా" లిఖించుట సాహసమాత్రమని నా యభిప్రాయము. ఈ విషయమునఁ, బ్రస్తుత మింతకన్నఁ బెంచివ్రాయను. ఎట్లయిన నేమి నా పేరు గూడ వీరి వివాద సందర్భములో నెక్కుటచే నమాయికులగు మా గురువుల కపోహ గలిగించునేమో! కారణాంతరముననేని యా సమయమున నేను బందరులోనను, గుడివాడలోనను నుండుట వారి యూహను బలపఱుప వచ్చునని యెంచి యొక యుత్తరమును మాత్రము గురువుగారి పేర వ్రాసికొంటిని. దాని సారాంశము "ప్రస్తుత సందర్భమునకుఁ దాము తొందర