పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/712

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

816

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఆటకున్ను గోళీ కాయలాటకున్ను అంతగా భేదం కనుపడదు. అవధానంలో చదరంగానికి బదులు దీన్ని పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడంవల్ల అవధానానికి లాభం లేదు సరికదా, నష్టంకూడా వుంది. యేమంటే? చదరంగమేవున్నట్టయితే యెత్తు ఆలోచిస్తూన్నట్టు నటిస్తూ ఇతర విషయముల ధారణ కొంత భద్రపఱుచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ బోర్డాటలో అట్టి అవకాశం వుండదని నేననుకొంటాను. పేకాట కూడా ఈ బోర్డు వంటిదే. కనుక అవధానంలో, చదరంగమే వుండాలి. అయితే మీకుమారుడే మీ అభిప్రాయానికి భిన్నంగా యెందుకు ప్రవర్తించాలని అడుగుతారేమో, ఇందును గుఱించి ప్రేక్షకుడుగారివ్రాతే మీకు సమాధానం చెపుతూవుంది చూడండి.

"యీ కవికుమారులు. వేంకటశాస్త్రిగారి..... అనుమతిని బడసి యనంతర మీయవధాన విధానమునకు గడంగినచో...." పై వాక్యం వల్ల ఈ ప్రేక్షకుడు నన్ను బాగా యెఱిగిన సుజనశిరోమణి యనిన్నీ మాప్రాంత నివాసియే యనిన్నీ చదువరులకు విశదం కనుక విస్తరించను. మా పిల్లని యీడు పదిహేను వెళ్లి పదహారోవత్సరం, రెండోకుఱ్ఱాడు నా మేనకోడలి కొడుకు వీడికంటె వక వత్సరం సుమారు పెద్దవాడే వోరెండింగ్లీషుముక్కలు అక్కడాఅక్కడా నేర్చుకున్నాడు. ఆంధ్రంగాని గీర్వాణంగాని వాడితండ్రి అభ్యసించాడుగాని వాడభ్యసించలేదు. కాని తల్లి చనిపోయిన హేతువుచే యింట్లోదిక్కులేక యీ మధ్య దేశ సంచారం మాత్రం విశేషించి చేయడం చేత “దేశాటనం పండిత మిత్రతాచ” అన్న సామగ్రిలో మొదటిది కొంత వఱకు సంపాదించినట్లయింది. ఇక మావాడి పాండిత్యం ఇంట్లోచదువవడం చేత శ్రద్ధాభక్తులు సున్నగా కావ్యనాటకాలున్న లఘుకౌముది చాలావఱకున్ను కంగాబంగాచదివి ఈ మధ్య నేను పూర్తిగా అనారోగ్యస్థితికి వచ్చిన తర్వాత అంతకుపూర్వ మంతోయింతో చదివిన సిద్ధాంతకౌముదిని పూర్తి చేసుకుందామని కుతూహలం కలిగిందిగాని యేం లాభం; అంతబాగా జరగడంలేదు. అయినప్పటికీ కొంత కృషి చేయడం వల్ల "కృషితో నాస్తి దుర్భిక్షం" కనుక కొంత అక్షరజ్ఞానం సంస్కృతంలోనేకాక - తెలుగులో కూడా కలుగుతున్నట్లుంది. కాని ఈమాత్రం జ్ఞానంతో వచ్చీరాని కవిత్వంతో అవధానాలు మొదలు పెట్టడానికి వల్లకాదు. ఏమంటారా? అవధానికి సభ్యులను సంతోషపెట్టేశక్తి చాలావుండాలి. ఆశక్తికీ అవధానశక్తికీ సంబంధమేవుండదు. అవధానశక్తి కేవలం ధారణకు మాత్రమే సంబంధించి వుంటుంది. పైశక్తి, వాఙ్మాధుర్యాదులతో చేరి వుంటుంది. ఇది గురుశుశ్రూషవల్ల కూడా వచ్చేది కాదు చూడండి. పైవాచామాధురిలోనుగా గలుగు విద్వత్తుల్ పురాసంచిత - ప్రాచుర్యమ్ముననబ్బు నేరివశమౌ! భాగ్యమ్ముకామేశ్వరీ"