పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/710

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

814అష్టావధానమంటే!

(12-8-1935 సం||ర త్రిలిఙ్గ నుండి)

ఏకకాలమందే ఎనిమిదిపనులయందున్ను బుద్ధి నిల్పడం. ఇది మొట్టమొదట వేదం అధ్యయనం చేసినవారు చేసేపని అని సంప్రదాయజ్ఞులవల్ల వింటాము. వేదంలో “ఘనామాలాశిఖా" ఇత్యాది భేదాలున్నా యనిన్నీ వాటికి సంబంధించిన అవధానాన్ని వారిలో బుద్ధిమదగ్రేసరులు చేసేవారనిన్నీ ఆకారణంచేతనే వారికి అవధానులు అనేపేరు వచ్చేదనిన్నీ వినికి. ఇటీవల అట్టి అవధానం చేయక పోయినప్పటికీ వేదంచెప్పుకొన్న మాత్రంచేతనే అవధానులు అనేపేరు వస్తూవున్నట్లు లోకవాడుకవల్ల మనకు తెలుస్తూ వున్నది. ఇందు కుదాహరణం “సుబ్బావధాన్లు, రామావధాన్లు" మొదలైనవి పెక్కులు. ఈ అవధానం క్రమంగా కొంతకాలానికి కవిత్వంలోకి వచ్చింది. మనకు తెలిసినంతలో ఈ అవధానమును సమర్ధించినవారు పూర్వులలో కొలదిమంది మాత్రమే వున్నారు. చరికొండ ధర్మన్న భట్టుమూర్తి, నెల్లూరి రాఘవకవి. మా రోజులలో మాకన్న కొంచెము పూర్వులు శ్రీమాడభూషి వేంకటాచార్యులవారు. వీరందఱున్నూ శతలేఖినీ పద్యసంధానధౌరేయులు, అనగా శతావధానులు. కనుక “శతేపంచా శన్యాయంచేత" "అష్టావధానులు" కూడ నైయున్నారు. అయితే శతావధానం కష్టమా? అష్టావధానం కష్టమా? అన్న విషయం కూడా మనకు ప్రస్తుతం విచారించదగ్గదే. సామాన్య దృష్టికి శతావధానంకన్న అష్టావధానం తేలికగా కనిపిస్తుందికాని బాగా పరిశీలిస్తే మాత్రం అట్టిదికాదు. కారణమేమంటే, బండపనిగా కనపడ్డప్పటికీ శతావధానంలో విషయం కవిత్వం వకటి మాత్రమే. అష్టావధానంలోనో? భిన్నభిన్న విషయాలుండడం వల్ల చిక్కు చాలా వుంటుంది. ఈ రెండు అవధానాలకున్ను పూర్వులు లక్షణాలు ఏర్పఱచారో లేదో మాకు తెలియదు. మా రోజుల్లో మేము సభ్యులకోరిక మీద లక్షణాలు ఏర్పఱచాము. అవి అచ్చుపడి వున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతంగనక అష్టావధానానికి మేం చెప్పిన లక్షణాన్ని వుదాహరిస్తాను.