పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/696

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

800

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నెట్టిఱేండ్లకు భోజోపమితి చెల్లునో యెట్టిఱేండ్లకుఁ జెల్లదో లోకమునకు విస్పష్టపడఁగలదు. మఱియు నప్పకవీయము తృతీయాశ్వాసమున

క. రాజమనోజా? విద్యా
   భోజా? దీనార్థికల్పభూజా రిపసం
   జ్ఞాజా? వైభవవిజితబి
   డౌజా? రవితేజ? గుత్తి యప్పలరాజా,

అని యుదాహరింపఁబడియున్నది. ఈ పద్యకర్త యయ్యలరాజు రామభద్రుఁడు. ఇమ్మహాకవికూడఁ దనకృతిపతిని విద్యావిషయమున భోజుఁడనియు, అర్థిమనోరథ పూరణమునెడల ననcగా దానవిషయమునఁ గల్పవృక్ష మనియు వేఱువేఱుగా వర్ణించియున్నాఁడు. ఇంతవఱకుఁ గావించిన చర్చవలన భోజుఁడు కవులగు రాజుల కుపమానమం దుండునే కాని కేవలదాతల కుపమానస్థానమున నుండఁడని తేలినది. “మహాభాష్యంవా పాఠయేత్ మహారాజ్యంవా పాలయేత్" అనునట్టు లేరాజునకు మహారాజ్యపాలనముకన్న మహాభాష్య ప్రవచనము ముఖ్యమో ఆ రాజునకే భోజోపమితి చెల్లునుగాని తదితరుల కాయుపమితి యన్వర్ధము గాక ఘృతకోశమై యపహాస్యాస్పదమను నంశమున కింతకన్న నుదాహరణములు చూపనక్కఱలేదు. మామిత్రులు మIIరా||రా|| పానుగంటి నృసింహారావుపంతులవారు చూపిన సమానధర్మము లనఁగా భాషాభిమానత్వము, పండితకవి పోషకత్వము, తర్కవ్యాకరణాది శాస్త్రములు పరీక్షింపించి సత్కరించుట, పూర్వాధునాతన గ్రంథ ముద్రాపణము, వేదపరీక్ష సూత్రభాష్యాద్యాంద్రీకరణ ప్రేరకత్వము లోనగునవి భోజోపమితి సంపాదకత్వము నెడల నకించిత్కరములు కావున "ఇది వఱకుఁ జెప్పిన సమానధర్మము లింకను మా మిత్రులకుఁ జాలవా, ఎవరు నాయనలారా? ఇట్లు చేయువారు" అని వ్రాయుట విచారదూరము. ఆ యీ సత్కార్యములకును ఈయుపమితికిని సంబంధమే లేదు. ఎవరికిఁ బంతులవారు భోజోపమితి సామ్రాజ్య పట్టాభిషేకము నొనర్ప నెంచినారో వారికి సంస్కృత మందుఁ గాకున్నను దెలుఁగునందేని మంచి కవితాశక్తి కాకున్నను దగు మాత్రము సామర్ధ్యమేని యుండఁదగు. దానిని బోషించుకొనఁదగు సాహితియు నుండఁదగు. అపు డాంధ్రభోజుఁడన్నచోఁ బ్రధానధర్మము సమన్వయించును. తెలుఁగు కవిత్వమనుటయేకాని యదియుఁ బైపైని లేదని మా మిత్రు లెఱుఁగుదురు.

తే.గీ. తెలుఁగు తెలుఁ గని యద్ధాన దిగుటెకాని
       సంస్కృతమ్మునకన్నఁ గష్ణమ్ము హెచ్చు
       ఒక్కదానఁ బరిశ్రమ మున్నఁజాలు
       దాని కిద్దానికో రెంటఁ దగులవలయు,