పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/694

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

798

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

ఈ పద్యము శ్రీరాజుగారి యంతఃపురము తన్నేమో యనినట్లు చెప్పినదాసిచేతి కిచ్చి యారాజునుంపుడుకత్తె యంతఃపురమున కంపించి నట్లు విందుము. అప్రస్తుతమే యైనను నప్పటికాలపు మనభాషౌన్నత్యము దెలియుటకై మఱికొంత యిట వ్రాయుచున్నారము. పిఠాపురమునకు నతిసమీపమున నున్న చంద్రంపాలెము గ్రామమున వసించు మహాకవి కూచిమంచి తిమ్మకవిగారి రసికజనమనోభిరామమును జదివి యక్కవి సార్వభౌముని దర్శింపఁ గుతూహలినియై యావేశ్య మహారాజావారు కోటిఫలి దయచేయునవసరమున వారితోఁ దానును బయలుదేరి యిక్కవి గ్రామ సమీపమున డిగి ప్రచ్ఛన్నముగా నీకవిని దర్శించిన సందర్భమునందలి పద్యము కూడ నిట నుదాహరించుచున్నారము.

చ. చతురులలోన నీవుకడు జాణ వటంచును బిట్టుఁ గౌగిలిం
    చితి నిటు మాఱుమో మిడఁగఁ జెల్లునె? యోరసికాగ్రగణ్య య
    ద్భుతమగు రంగుబంగరపు బొంగరపుంగవరంగు లీ న్గుచ
    ద్వితయము ఱొమ్మునాటి యదె వీఁపున దూసె నటంచుఁ జూచితిన్.

ఈ పద్యమునందలి పూర్వార్ధము వేశ్యకవిత్వ మనియు నుత్తరార్ధము తిమ్మకవిగారిదనియు స్పష్టమే. ఏ సందర్భమునవారి కిట్టియుక్తి ప్రతియుక్తులు జరిగినవో యదియును బద్యమే చెప్పును గాన విస్తరింపము. ఇఁకఁ బ్రస్తుతమునకు వత్తము. వేశ్యల దగ్గర నుండి కూడ నిట్టికవితాప్రసక్తి గల యాకాలమునందలి యా విజయరాఘవ సార్వభౌముని సాహిత్య సౌహిత్యము లెట్టివో చదువరు లూహించుకొందురుగాక. మొదట నుదాహరించిన శ్లోకార్థము వ్యాఖ్యామూలమునఁగాని యెల్లరకు సుబోధము గాదు. కాని గ్రంథవిస్తరభీతిచే నవసరమైనంత వరకే వ్యాఖ్యాన మొనర్పఁబడుచున్నది. తిమ్మనృపతికి, తాత్కాలికపు పెద్దాపుర సంస్థానప్రభువు, అవనే = పాలనము నందు, అం = విష్ణువును, సాహిత్య రీత్యామ్ = పాండిత్యమునందు, భోజం = భోజమహారాజును, దృశోః = చూపుల విషయమున, అంభోజం = పద్మమును, సదృక్షం = సమానమైనదానినిగ, కలయ౯ = చేయుచు, ఇదేరీతిగా నాయాయీచరణములన్నియు నన్వయింపనగు. మన కిందుఁ బ్రస్తుతాంశము, భోజరాజుతో బోలిక గావలసిన ఱేనికి మంచిపాండితియు మంచి కవితయు నుండి తీరవలయు ననునది. ఆ సందర్భ మిందుఁ బూర్తిగాఁదేలుచున్నది గాని యద్వితీయ మగునీ శ్లోకమును రచించిన విజయరాఘవ సార్వభౌమునికి భోజునితో నుపమతిని సాధించుట కీచర్చ యుపకరించునే గాని దీని నేరాజు నుద్దేశించి యాయన వ్రాసి పంపెనో యాయనకట్టి యుపమితి నిది సాధింపదు. సత్యమే కాని మహాకవి విజయరాఘవ