పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/688

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

792

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మొదట క్రిమినలు తరువాత సివిలులోకి డేకి తుట్టతుదకి మొదటికే మోసంగా పరిణమించింది. “ఢిల్లీ వల్లభ హస్తపల్లవ తలేనీతం నవీనం వయః" యీ కవిలోకచక్రవర్తికి ఆయీ నాకబలి సన్మానం నచ్చదని వ్రాయాలా? అక్కఱలేదు. మఱిన్నీ శ్లో. నిర్మాణేయది (కొంత జ్ఞాపకంలేదు) మార్మికోయది... నోచేద్దుష్కృత మాత్మనా కృత మివస్వాంతా ద్బహిర్మాకృథాః. ఆయీ పండిత రాయల శ్లోకానికి ముఖ్య తాత్పర్యం "అయ్యానీకు పండిత సమ్మతంగా రచించే నైపుణి వుంటేనే నీరచన గద్యమో పద్యమో వినిపింపుము. అన్యథావున్న పక్షంలో నీవుచేసిన పాతకం దాఁచుకున్నట్లే కవిత్వంకూడా దాచుకోవడమే యుక్తం" అని బోధిస్తున్నాఁడు. ఆయీధోరణినిబట్టి విచారిస్తే రాయల ప్రకృతి సగర్వంగాని నిగర్వంలోచేరదు. రాయలుచేసిన మైత్రి తురుష్కులతోటి. తిన్నసొమ్ము తురుష్కులది. వొకటేమిటి సర్వమూ తురుష్కులదైనప్పడు సాత్త్వికత్త్వ మాయనకు దవ్వుగా నుండడం యుక్తిక్షమం.

కాళిదాసు చల్లగా అంటిస్తాడు. మనస్సుకు నొప్పి కలిగించడు. కాని అవసరమైనంత నొప్పి ఆ రచనలో వుండకపోదు. "అభిరూప భూయిష్ఠా... అన్న వాక్యంలో కావలసినంత తలబిరుసుతనం బయటఁబెట్టవచ్చు. యీసభ పండితులతో నిండివున్నది కనక (లాకలూకాయల రచనకాక) నేఁడు కాళిదాసకృతమైన దేదేని ప్రదర్శిస్తేనేకాని మాటదక్కదు. ఆయీకాళిదాసవాక్యం సర్వమూ “అస్తమేతిగభస్తిమాన్" అన్నదాని వంటిది. సకల ఫల సంపెగ పువ్వువలెనే యిదిన్నీ వారువారు వివక్షించుకున్న అర్ధాన్ని స్ఫురింపఁజేస్తుంది. వాచ్యార్థలక్షణార్థ వ్యంగ్యార్థాలు మూడింటిలోనూ ఆలంకారికులు వ్యంగ్యార్థానికే ప్రాధాన్యం యిస్తారు. కనక పండితరాయలకన్న కాళిదాసుకే గర్వ ప్రకృతిమత్త్వం ధ్రువపడుతూవుంది. వొకానొకప్పుడు తనశక్తిని వున్నది వున్నంతలో దాచిపెట్టక ప్రకటించడం కూడా యుక్తమే అన్నారు మాపిన్న ముత్తాత నరస కవిగారు,

ఉ. ఏ నిటువంటివాఁడనని యెన్నిక కావ్యకథానులాప సం
    ధానమునందు శాత్రవ విదారణ మందు ...
    ...యుక్తమటుగాన ప్రశంసయొనర్చితిన్ మదా
    ఖ్యానము రామచంద్ర కృపకాదె మహాత్ములెఱుంగ కుందురే.

కావ్యారంభమందు, పెళ్లి బేరాలు పొసఁగ జేసేటప్పుడు, యుద్ధమునందు, స్వభావోక్తిగా మాటలాడుటలో దోషములేదు అని పద్యతాత్పర్యం, దీనిమీద శంకాసమాధానములు విస్తరిస్తే చాలా పెరుగుతుంది గ్రంథం. కనక యిప్పటికి యింతతో స్వస్తి చెపుతున్నాను.

★ ★ ★