పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడియాస

785

(ఇదికూడా డిటో, ఆరంభావస్థలో యీ విధంగా నడిచి క్రమంగా శరన్నదీజలంవలె మాఱుతుంది. మచ్చు చూపుతాను)

శ్లో. శర్వాణి! దేవి! పరితః పరితాపితో౽ యం
    సంసారదుఃఖదహనేన తదేకశాంత్యై
    నీహారభూధరపురాకృతభాగధేయం
    త్వాం భావయామి గిరిశస్య తపో౽ న్తరాయమ్.

యెంతశైలి తేలికలో వుంటే కవిత్వానికి అంత గౌరవం. కాళిదాసాదులకు కఠినశైలిలో వ్రాయడం చేతకాక నేనా -

“మందఃకవియశః ప్రార్థీ గమిష్యా మ్యపహాస్యతామ్." యిట్టిశైలిలో వ్రాయడం? దీన్ని గుఱించి వ్రాయవలసివస్తే సుఖసుఖాల తేలదు. భగవంతుఁడనుగ్రహిస్తే మఱొకప్పుడు చూచుకుందాం.

శా. నీకీర్తివ్రతతుల్, అనే పద్యం మాదిరి పద్యాలు యేకవిగాని తన జీవితంలో యెన్నో వ్రాసివుండఁడు. యీమాట జ్ఞప్తిలో ఉంచుకోండి చదువరులు. స్వతంత్రంగా రచించే రచనలో కూడా కవితెల్వితేటలు (ఎవ్వనిగుణలత లేడు వారాసుల కడపటి కొండపైఁ గలయఁబ్రాకు) ప్రకటిత మవుతవి. బ్రాకెట్టులోది తిక్కన్నగారిది. యింకొకరిది చూపుతాను "తిలకమ్ముదిద్దిఁ దిద్దితిఁజూడుమనురమాసుదతి చెక్కులనీడ, జూచువాని" యీకంకంటి కవీంద్రుఁడు యెన్నోచోట్ల కవిబ్రహ్మగారిని మించడం కలదు. “ముఖేముఖే సరస్వతీ” గదా? భవతు. అడియాసనుగూర్చి వ్రాస్తూ ప్రసక్తానుప్రసక్తంగా (వార్ధక్యదోషంచేత) కవిత్వం ఆరంభ దశలో యేవిధంగా వుంటుందో క్రమక్రమంగా యేవిధంగా మారుతుందో అనే ప్రసక్తిలో కొన్ని వాక్యాలు వ్రాశాను. పోనిండు అవిమాత్రం జిజ్ఞాసువుల కుపకరింపవా? చూడండీ యీ రెండు పద్యాలున్నూ-

ఉ. ఎందఱిఁ జూపెనేని వరియింపదు మాకవితా కుమారి క
    న్నందుకు దేశముల్ తిరుగుటబ్బెను సౌఖ్యము లేకపోయె నా
    నందనృపాల! నీదుసుగుణమ్ములు చెప్పిన నాలకించి వెం
    టం దలయూఁచెఁ గావునఁ దటాలునఁ దీనిఁ బరిగ్రహింపుమా?

ఉ. అందఱ కన్నివంకలను నల్లుచునుండునెకాని యెవ్వనిన్
    బొందుట కీచ్చిగింప దదెపోయని యేనును నూరకుందు మీ
    యందునమాత్ర మిచ్చ కలదంచును సూచన సేయుచుండు నే
    నందనిమ్రానిపం డిది యటందును తానటు కాదు కా దనున్.