పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/679

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడియాస

783


చేసి దాఁచినది అయిపోవడంతోనే దీనిభరతం పట్టించడానికి ఆరంభిస్తారనిన్నీ ఆలాగ తవ్వడానికి ఆరంభిస్తే అదేనాయెంతో కాలం ఆఁగదుకనుక (దివసైః) యే కొన్ని రోజుల్లోనో భూమి మట్టానికి తవ్వడం తటస్థిస్తుందనిన్నీ అంతటితో రాత్రింబవళ్ల భేదమును కలిగిస్తూవున్న-మేరువునీడ వదలి 24 గంటల కాలమూ సూర్యుఁడు నిరాటంకంగా ప్రకాశించడంవల్ల తనకు లోఁగడ కవిసమయసిద్ధమై అనుసరిస్తూవున్న వియోగదుఃఖం అంతరిస్తుందనిన్నీ చక్రవాకి ఆనందిస్తూవుందని ప్రతాపరుద్రుని దాతృత్వాన్ని కవి లోకోత్తరమైన తన ప్రతిభ ద్వారా ప్రశంసించాఁడు. యితరభాషలలో కవులూవున్నారు. రసవంతమైనరచనలూవున్నాయి, లేదా వుంటాయిగాని యీఅతిశయోక్తివంటి అతిశయోక్తులు లేవనే ఆభాషా పండితులవల్ల వినడం, ఆయీ చక్రవాకివంటి- గొంతెమ్మ కోరికలు తలపోసుకునే వాళ్లు ప్రాజ్ఞలోకంచేత పరిహసించఁబడుతూ వుంటారు. ప్రస్తుత చక్రవాకి వంటి వారిని గూర్చినదే ఈ కథ.

"అనఁగా అనఁగా వొకబ్రాహ్మడు-ఆయనకు పెళ్లీగిళ్లీ లేదు, నెలకు రోజులు ముప్పై యింటిలోనూ యే నాలుగో అయిదోతప్ప తక్కిన రోజులన్నీ బ్రాహ్మణార్థాలతోనే కాలక్షేపం, ఆబ్దికాలవాళ్ల పేర్ల కేట్లాగు ఆయన దగ్గిర వుంటుంది. రెండు మూడు రోజులు వ్యవధి వుండఁగానే జాపితా ప్రకారం ఆగృహస్థుల యింటివద్దకు వెళ్లి ప్రస్తుతవిషయం జ్ఞప్తికి తెచ్చి రెండో బ్రాహ్మణ్ణి యెవరినేనా నిమంత్రించారా లేదా అని ప్రశ్నించేవాఁడఁట! యీ ప్రశ్నవల్ల మొదటివాఁడుగా తానువున్నట్లు ద్యోతకం, సరే ఆ బ్రాహ్మడో యింకొకబ్రాహ్మడో బ్రాహ్మణార్థం చేసుకొనివచ్చి దేవాలయం ముఖ మంటపం చిట్టచివర కూర్చుని జుట్టు దులుపుకోవడంలో వొక నువ్వగింజ కిందరాలింది. ఆబ్రాహ్మడు ఆ గింజ చేతిలో పెట్టుకొని “రిక్తుని మనసు కోరికలు పెద్ద" కనక యీ విధంగా తలపోతలకు ఆరంభించాఁడఁట. - యీ గింజ కత్తిరి కార్తిలో నేదొడ్లోనో పాతితే అది చక్కగా పెరిఁగి పెద్దచెట్టుఅయి అధమం సోలెఁడు నువ్వులేనా చేతికి దొరుకుతాయి. వాట్లను వొక సెంటుభూమిలో చల్లితే కుంచెడో రెండు కుంచాలో అవుతాయి. మళ్లా మళ్లా చల్లుతూ వుంటే అదృష్టానుసారంగా పుట్లకొద్ది పెరిఁగి ధర బాగావున్నప్పుడు కఱవుకాలంలో బ్లాకు మార్కెట్టులో అమ్మితే వందలకొలఁది లాభం వస్తుంది. ఈ సంగతి బంధుజాతానికి తెలిసి పిల్లని యివ్వడానికి యింటిచుట్టూ మూగుతారు. వొకరు వెయ్యంటే యింకొకరు రెండు వేలంటూ వేలంపాట ప్రారంభిస్తారు. మనస్సుకు నచ్చినకన్యను పెళ్లిచేసుకుని సుఖంగా కాపురం చేస్తాను. పిల్లాజెల్లా కలుగుతారు. నేను మేడమీఁదే తుఱుచు మకాం. నాపెళ్లాం నాపిల్లలిని నా దగ్గిఱకి వంట అయింది, భోజనానికి రండి అని కబురంపుతుంది. నేను విలాసంగా గర్వంగా యింకా నాకు ఆకలి కావడంలేదు అని బిఱ్ఱబిగుస్తాను. అని అడ్డం తిరగడాన్ని అభినయించేటప్పటికి