పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/676

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

780

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వస్తుంది. ఆయీఅర్థాలన్నిటికీ ఆధారం మన కేమిటంటారు. లోక వ్యవహారమే. అందుచేత కవికి అన్నిటికంటే లోకమేముఖ్యం. అందులో బొత్తిగా పశుప్రాయులుగా వుండేవాళ్ల వ్యవహారమున్నూ (యెల్లేఁడు, యేంది, ఉండేడు వగైరాలు) బొత్తిగా చేదస్తంగావుండేవాళ్ల వ్యవహారమున్నూ (ఆస్సే, వుంచుంది, యేమిషే వగైరాలు) కవులు పుచ్చుకోక యితరాన్ని కొద్దిగా సంస్కరించి వుపయోగిస్తూ వచ్చారు.

(1) గతకాలము మేలు వచ్చుకాలముకన్నన్,

(2) నీమగఁడంత యెక్కుడె?

(3) నరునకుఁ. చుట్టమెవ్వరు?

(4) మాకీ పుట్టువునకుఁ బాండుక్ష్మాపాలుఁడు నిన్నుఁజూపి చనియె

(5) ఓడితేనియు వద్దు మొఱ్ఱో యనంగ లింగమును గట్టకుడుగ మెఱింగి నొడువు.

చాలును విస్తారమెందుకు. ఇందు 1-వ నంబరు. పోయినరోజులు మంచివి. అనే వాక్యాన్ని పురస్కరించి పుట్టినది. 2-వ నంబరు. నీమొగుఁడే అంత గొప్ప వాఁడేమి అన్నదాన్ని పురస్కరించి పుట్టింది. 3–వ నంబరు. చుట్టమెవ్వఁడు అని యేకవచనంలో వుండవలసివున్నా లోకంలో బహువచనంలోనే వాడడాన్ని బట్టి పుట్టింది. 4–వ నంబరు చనియె అనుధాతువునకు మరణించు అను నర్ధమున్నూ లోకవాడుకనుబట్టి సంపాదించుకో వలసిందే. అయితే ఇక్కడ చనియె అనక చచ్చె అని సవరించకూడదా? అనే వారున్నూ వుండవచ్చును. మా జన్మమంతా యీలాటి శంకలకే వినియుక్త మయింది. బళ్లకొద్ది వ్రాసిన వ్యాసాలున్నాయి. పత్రికల నుండి పునర్ముద్రితాలు పుస్తకాలున్నాయి చూచుకోండి. కవిబ్రహ్మ ఆలా వాడక యీలా యెందుకుపయోగించాఁడో తెలుస్తుంది. ఇంక 5-వ నంబరు. ఎఱింగినొడువు అనేది, తెలిసి మఱీమాట్లాడు అనే వ్యావహారికాన్ననుసరించి పుట్టింది. ఛందోబద్ధం చేయడంలో "మఱీ" అనేది లోపించింది. లోపించినా వ్యవహారంలో అనుభూతమై వుండడంచేత దాని అర్థం కూడా వస్తుంది. వ్యవహారబలంవల్ల విభక్తులుకూడా కలిసివస్తూంటాయి క్వాచిత్కంగా, "వాఁడుయ్యా లూఁగుచున్నాఁడు." ఇందులో "ఉయ్యాల” పదం ప్రథమావిభక్తిలోవున్నా సప్తమ్యర్థము చెప్పికోవాలి. అంతేనే కాని ఉయ్యాలనూఁగు చున్నాఁడు అని సవరించడంలో వివేకం కనపడదు. ఒకప్పుడు గ్రంథకర్తకే ఛందోబద్ధం చేయడంలో కుదరక సప్తమ్యంతంగా పడితేనో? గణముల చిక్కున్నదికనక ఆకూర్పు క్షంతవ్యంగా భావించవలసి వుంటుంది చూడండి. “చింతయాకంతైనంగడమైననుం గడమ" అన్నచోట పద్యంలోకనక చింతయాకన్నాఁడు గాని రామలింగం, వచనకవిత్వమే అయితే