పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/674

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

778

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కొందఱికేమో? ఆలోకం మాత్రమే. కొందఱికి రెండున్నూ అనుకూలిస్తాయి, కొందఱికి రెండూ కూడా చెడుగుగానే వుంటాయి." అనే వ్యావహారికపు మాటలకే కొంత మెఱుఁగుపెట్టి ఛందోబద్ధంచేస్తే లోకోత్తరమైన పద్యంగా పరిణమించింది. యెవరు కవిత్వం చెప్పినా యాభై యాఱక్షరాలలోనే. వొక్కొక్కరి కూర్పు ఆనందజనకంగా వుండడానికిన్నీ వొక్కొక్కరిది అన్యథా వుండడానికిన్నీ కారణం చెప్పడం కష్టం. అందఱు వండే పదార్థాలూ వొక మాదిరివే. పాకభేదంవల్ల రుచి భేదించడంలేదా? అన్నీ మామిడిచెట్లే. ఆకులు వగైరాల ఆకారంలో భేదం తెలుసుకోవడం దుర్ఘటం. పండ్లలోరుచి భేదం కలగడం లేదా? యెంతమట్టుకు కవిలోకాన్ని గురువుగా పెట్టుకుని రచన సాగిస్తాఁడో అంతవరకే రచన రుచిస్తుంది. లోకాన్ని నిరసించాcడా? అధఃపతనం తప్పదు. భవభూతి యేదో సందర్భంలో “ఉత్పత్స్యతే మమతు కోపి సమానధర్మా" అని అంటే అన్నాఁడుకాక యేదో నీరసరచన రచించే ప్రతికవికిన్నీ భవభూతి వాక్యం వుపాదేయం కాదు. భవభూతి కవిత్వం లోకగురుకమేకాని లోకాన్ని వదులుకున్న సంస్కృత కవిత్వం పూర్వకవులకు దేశభాషమాదిరినే నడిచేదేమో కాని యిప్పటి కవులకట్లు నడవదు. తెలుఁగుసహజంగా నడుస్తుంది. వ్యావహారికభాషను వదులుకున్నా అవ్యయాలు వగైరా తెలుఁగు కవిత్వంలో వ్యావహారికంగానే దొర్లుతాయి. యీ విషయానికి వుదాహరణలు చూపవలసివస్తే భారతంలో చాలా భాగం వుదాహరించవలసి వస్తుంది. "వారువచ్చి నీకిచ్చిరేని పాణి గ్రహణము చేయుము నన్నున్." అన్నాఁడు కదా? నన్నయ్య యిది సంస్కృత మర్యాదనుబట్టి సమన్వయిస్తుందా? చేయుధాతువు ద్వికర్మకం కాదు. అట్టి స్థితిలో నీవు నన్ను పాణిగ్రహణం (పెండ్లినిచేయుము) అంటేసమన్వయించిందా? యథాకథంచిత్తుగా సమన్వయించిందే అనుకుంటే వచ్చేవిప్రతిపత్తి చూడండి. శకుంతలావాక్యం గదా యిది. ఆమె దుష్యంతుణ్ణి తన్ను పెండ్లియాడవలసిందని చెప్పేమాటకు మఱోలాగు అర్థంవస్తూవుంది. నీకు నన్ను పెండ్లిచేయుము. యెవరికో అన్యులకిచ్చి పెండ్లిచేయవలసిందని కంఠోక్తిగా చెప్పినట్లయింది. దానితో రసాభాసం సిద్ధమయింది. (ఏకత్రైవానురాగశ్చేత్ చూ.) అసలు నన్నయ్యతాత్పర్యం శకుంతల దుష్యంతుణ్ణి మనస్ఫూర్తిగా వరించివుండిన్నీ తండ్రిగారి సమ్మతి పర్యంతమున్నూ వేచివుండవలసిందని కొంచెం వ్యవధిని సూచిస్తూ దానిమీఁద దుష్యంతుఁడు హతాశుఁడయి బలాత్కారానికి (కామాంధానాం యుక్తా యుక్తవివేక శూన్యత్వాత్) సిద్ధపడతాఁడేమోనని తండ్రిగారికి కొన్ని విశేషణాలు. (1) కరుణా నిరతులు (2) ధర్మస్వరూపులు అనేవి వేసినారు, తప్పక మనయనురాగమును గౌరవిస్తారని గుప్తంగా తెలుపుడుచేసింది. నన్నయ్యగారి కవితా ప్రాశస్త్యాన్ని తెలపడానికి (1) ఉ. నిండుమనంబు నవ్యనవనీత (2) మ. మదమాతంగ తురంగ. అనే పద్యాలు వుదాహరించి యేవోకథలు వుద్ఘాటిస్తూ వుంటారు. ఆ పద్యాలు