పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/670

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

774

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అవకాశం వుంటుంది గాని సంస్కృతశబ్దాలలో అంతగా వుండదు. యెందుచేతంటారు? తెలుఁగేమో? అభ్యసించకుండా వస్తుందాయె. సంస్కృతం కష్టపడి గురుశుశ్రూష చేస్తేనే కాని రాదుగదా? అట్టి భాషలో యెవరికోతప్ప అపభ్రంశాలు దొర్లవు. (యీ మాట యిప్పటి నవకవులకు చెల్లుబడికాదు) గేయ కవితావిషయంలో అపభ్రంశాలు దొరలడం సంస్కృతంలోకూడా వున్నట్టే యీ క్రిందివాక్యంవల్ల స్ఫుటమౌతూ వుంది. "కి మపభ్రంశేన భవతి గీతస్య" అన్నాఁడు ఆచార్యగోవర్ధనుఁడు; యీ మాట సంస్కృత కవిత్వానికి లగించేదే గాని తెలుఁగుకి లగించేదికాదు. గోవర్ధనాచార్యులు తెలుఁగువాఁడని ప్రతీతిలేదు. ఇతని పేరెత్తిన జయదేవుఁడు గీతగోవిందకర్త కూడా తెలుఁగువాఁడుకాఁడు, వోడ్రుఁడు. తరంగాలని వ్యవహరించంబడే "కృష్ణలీలా తరంగిణిలో" విస్తరించి కాకపోయినా యే మాత్రమో వ్యాకరణదోషాలు దొరుకుతాయి. గోవర్ధనుఁడు చెప్పిన దానికి యీ తరంగభాష లక్ష్యమై యుండదు. నారాయణతీర్థులకన్న గోవర్ధనుఁడుచాలా పూర్వుఁడై వుండాలి. అష్టపదులు రచించిన జయదేవుఁడే తీర్థులకన్న ప్రాచీనుఁడు. ఆజయదేవుఁడు "ఆచార్యగోవర్ధనః" అని యితణ్ణి పేర్కొన్నాఁడు. మొత్తంమీఁదమాట సంస్కృతమనండి, తెలుఁగనండి యింకే భాషేనా అనండి గేయరచనలో వ్యావహారికాన్ని స్పృశించకుండా వుండదన్నమాట. పద్యకవిత్వంకన్న పదకవిత్వం ఆపాతమధుర మనేమాట అందఱూ వొప్పుకుంటారు. “ఆద్య మాపాతమధురమ్” అనేది సుప్రసిద్ధం. వినీ వినడంతోనే ఆకర్షించేది గేయం, దానికి భాషావిచారంతో పనిలేదు. గాని నూఱులో తొంబైపాళ్లు గీతానికే వదిలి పెట్టినా పదిపాళ్లేనా భాషను బట్టిన్నీ మాధుర్యం వుంటుంది. దాన్ని బట్టే గాయకులు సంగీతానికి వాడుకునేశ్లోకాలు “శ్లో సజల జలదనీలం వల్లవీ కేళిలోలం” వంటివేకాని - "శ్లో వాశ్చా రేడ్ధ్వజధ గ్ధృతోడ్వధిపతిః క్రుద్రేడ్జజానికిః” మాదిరివి వాడుకోరు. త్యాగరాయాదులు (పూర్వమెప్పుడో కొన్ని తరాలనాఁడు తెలుఁగుదేశస్థులే) అఱవదేశస్థులే అయినా రచన యావత్తూ తెలుఁగులోనే సాఁగించడానిక్కారణం భాషామార్దవాన్ని పట్టికూడా గానానికి కొంత మాధుర్యాన్ని సంపాదించే వుద్దేశం వుండఁబట్టియ్యేవే. శ్రీకృష్ణదేవరాయలు “దేశభాషలందుఁ దెలుగులెస్స" అని చెప్పడానిక్కారణం మార్దవాన్ని పురస్కరించుకొనియ్యేవే. అచ్చతెలుఁగుకున్నంత మార్దవం తత్సమమిశ్రమైన భాషకు వుండదు. (మ. కురువృద్దుల్ గురువృద్ధబాంధవులనేకుల్ చూ.) అట్లే సహజమైన దేశ్యపు తెలుఁగున కున్నంతమార్దవం కృత్రిమ (కల్పిత) తెలుఁగుకున్నూ వుండదు. (సీ. పల్కుటాల్ దొరగ్రుడ్డు పనటు లాటలపట్టు. వగైరాలు చూ.) పై మాటకు అర్థం బ్రహ్మాండభాండము క్రీడాస్థానమని ఆ కృత్రిమ తెలుఁగు కన్న తత్సమపదమైనా బ్రహ్మాండ భాండశబ్దమే కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. పదకవులు అచ్చతెలుఁగునే వాడరు గాని వినేటప్పటికల్లా అర్థం గోచరించే మిశ్రభాష వాడతారు.