పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/660

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

764

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కలిసి వర్తిస్తాయి. వారి ఆశ్రమాలలో లేళ్లూ, పెద్దపులులూ కలిసి మెలసి వుంటాయి. ఆయన సమకాలీనులు మతచర్చలో దేశికులకు వోడిపోయినవారేకాని గెలిచినవారు లేరని ఆమతస్థులే కాదు నిజమైన చరిత్ర తెలిసిన మతాంతరులుకూడా విశ్వసిస్తారు. “శ్లో. శత్రోరపిగుణా వాచ్యా, దోషావాచ్యాగురోరపి” అనికదా అభియుక్తోక్తి. ఆయీ దేశికులవారి ప్రతిజ్ఞ క్రొత్తదిలాగువున్నా కొత్తదిమాత్రంకాదు. భారతం సభాపర్వంలో సహదేవుఁడు యీప్రతిజ్ఞనే చేసియున్నాఁడు. కాని అది మా కూటస్థులకు అవమానకరంగా వుందని నిషాదపడ్డవా రెవ్వరూ లేరు. అది బాహుబలస్ఫోరకం. ఇదో? విద్యాబలప్ఫోరకం. అయితే, యింకోమాట యేమిటంటారా “రాజు వచ్చినా రాకళ్లకు పాపయ్యుంటేనా?” (బొబ్బిలి పాట) అన్నట్లు, యీదేశికుల కాలంలో ఆదిశంకరు లుంటే యేమయేదో? యెందుకు యీప్రశ్న? “పెట్టఁగల బచ్చలిపాదును కొనఁగల గేదె తినిపోయింది” పై ప్రశ్న భావనాబలాన్ని వినియోగించి జవాబు చెప్పతగినది. అద్వైతులేమో మాశంకరులే గెలిచేవారని సంతుష్టి పడతారు. విశిష్టాద్వైతులు మాదేశికులే గెలిచి తీరుతారని చెప్పుకొని సంతుష్టి పడతారు. అయితే యింకో శంక. శంకరులు ఆకాలంలో లేరుగనుక దేశికుల వారి యెడమకాలు బాధ ఆయనకు లేశమూ సంఘటింపదు. యెవరేనా సంబంధిస్తుందే అయ్యోఅనిదుఃఖిస్తే అది అజ్ఞానవిలసితమే కానిఅన్యంకాదు. లేదా, దురభిమాన మనుకోవాలి. దాన్ని ఆలా వుంచుదాం. అప్పయ్యదీక్షితులవారు దేశికులకాలంలో వున్నారుగదా? సాక్షాత్తూ బ్రహ్మాపరావతారం. ఆయన్ని దేశికులు వోడించి ఆయన నెత్తిమీఁద యెడమకాలు పెట్టినట్లేనా దేశికులవారు? అంటే వినండి. అసలు దేశికులకాలంలో యావత్తుమంది అద్వైతపండితులతోటీ వాదం తటస్థించే వుంటుందని చెప్పఁగలమా? యేదో సభలో యేకొందఱితోటో వాదం వచ్చివుండును. అప్పుడు దేశికుల వారు యింతటి ఘోరప్రతిజ్ఞ చేయడానికి తగినంత హేతువు తారసమైవుండును. అంతేనేకాని అవచ్ఛేదకావచ్చేదేనా అద్వైతులు దేశికుల యెడమకాలు నెత్తిని పెట్టుకోవలసిన దురవస్థ వచ్చి యుండదు. “అదుగో పులి యిదుగో తోఁక” ఫలితార్థం దేశికులవారు అద్వైతమత సిద్ధాంతాలు ఖండించి విశిష్టాద్వైతాన్ని పోషించిన మహామహులు అన్నది. పనిపడితే దేశికులవారు దేవుణ్ణికూడా యెదిరించే ధైర్యం కలవారనడానికి కొన్ని యితిహాసాలున్నాయి.

“శ్లో. ఐశ్వర్యమదమత్తో౽సి మాం నజానాసి దుర్మతే!
     పరైః పరిభవే ప్రాప్తే మదధీనా తవస్థితిః"

యీశ్లోకం వొకానొకసందర్భంలో దేశికులవారు శ్రీతిరుపతి వేంకటేశ్వర స్వామిని గూర్చి చెప్పవలసి వచ్చిందని చెప్పఁగావిన్నాను. దానికి వున్న పుట్టుపూర్వోత్తరాలు