పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/658

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

762

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


నాటకం పనికివస్తుందిగాని పండితభూయిష్ఠమైన సభలో అయితే కాళిదాసుదేగాని పనికిరాదు. యీలాగే నన్నయ్య,

(1) "నిత్యసత్యవచను మత్యమరాధిపాచార్యు నన్నపార్యు"

(2) "అమలోదాత్తమనీష నే నుభయకావ్యప్రౌఢి పాటించుశిల్పమునంబారగుఁడన్"

అని కవిబ్రహ్మ యిదేరీతిని అందఱికీ చూపవచ్చును.

40 యేండ్లనాఁడు కవిసింహగర్జితములు అనే పేరుతో వొక చిన్న పుస్తకం ప్రచురింపఁబడింది. వలసినవారు దానిలో చూచుకుంటారు. కీ|| శే|| కస్తూరి శివశంకర కవిగారు యేదో సందర్భంలో వొక వ్యాసం వ్రాశారు. అందులో ఆయీవిషయం కూడా స్వల్పంగా స్పృశించినట్లు జ్ఞాపకం. (అది "గుంటూరిసీమ"లో వుంటుంది) అయితే ఆయీ కవులు తమ గొప్పఁదనాన్ని చెప్పుకున్నారు గాని యితరుల మీఁదికి దూఁకినట్లు లేదంటారేమో? ఆ చెప్పుకోవడంలో వ్యంగ్యంతీస్తే దూఁకడమూ కనపడుతుంది. పోనివ్వండి, అంత శ్రమయెందుకు, వాచ్యమే దొరుకుతూ వుండఁగా? లోఁగడ "శిరస్సు నిహితం మయాపదమదక్షిణం లక్ష్యతామ్." యీశ్లోకం యెందుకుఁ బుట్టిందో యెఱుఁగుదురా? రామానుజమతం యెవళ్లు వొప్పరో? అనఁగా వారిసిద్ధాంతాన్ని ఆమోదించి (చక్రాంకనాదికం, ఊర్ధ్వపుండ్రధారణం వగైరా) ప్రవర్తించక వివదిస్తారో; అట్టి ప్రతివాదిపండితు లెవరేనా సరే వారి శిరస్సులయందు నా కాలు-కాదుకాదు యెడమకాలు పెట్టఁబడింది. అనఁగా పెట్టితీరుతానన్నమాట. యీమాటలు “తదన్యమతదుర్మద జ్వలితతేజసాం వాదినాం” అనే మూఁడవచరణంలో కనపడుతూ వున్నాయా? (మత ప్రచారకులలో శ్రీ నందిరాజు దీక్షితులుగారు తిరుమణి తిరుచూర్ణధారకులను గూర్చి ప్రతిజ్ఞ చేయడం, మతుకు మిల్లివారు యెదిరించడం వగయిరాలు గ్రంథవిస్తర భీతిచేత వుదాహరించ లేదు) కుడికాలు పెడితే యెక్కడ ప్రతివాదులను గౌరవించినట్లవుతుందో అని యెడమకాలన్నాఁడు. తదన్య- రామానుజులవారికన్న యితరులయొక్క మత-మతములు, అద్వైతం, ద్వైతం, శైవం, శాక్తేయం, ఇవన్నీ కావచ్చును గాని దేశికులవారి తాత్పర్యంమాత్రం అద్వైతమతమనియ్యేవే. అద్వైతమతోద్ధారకులు ఆదిశంకరులు గతించి అప్పటికి కొన్ని శతాబ్దాలు అయినా శంకరులనెత్తిమీఁద వేదాంతదేశికులు యెడమకాలు పెట్టినట్లయిందనిన్నీ, ఆయీ దేశికులవారేమి, అసలు విశిష్టాద్వైతమతోద్ధారకులు శ్రీరామానుజులవారేమి, యింకా శ్రీవైష్ణవమత ప్రచారకులు మఱికొందరేమి శంకరులవారి భాష్యం అంటూ పుట్టివుంది గనక "అమర్చినదానిలో అత్తవ్రేలెట్టింది." అన్న మాదిరిని తమ మతానికి అనుకూలించే మాటలు వ్రాసుకున్నారు గాని ఆయనలో యెన్నోవంతున్నూ