పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వమూ-బ్రాహ్మణత్వమూ

761


నన్నయ్యకున్ను కూడా సంఘటిస్తుందా? తనకు సమకాలీనుఁడైన గౌడడిండిమభట్టువఱకే సంఘటిస్తుందా? శ్రీనాథుఁడువైదీకి కాఁడు. నియోగి అవును గాని మన దేశంలో విస్తరించి వుండే ఆర్వేల నియోగిన్నీ కాఁడు. యిందుకు అతనిపద్యపాదం "పాకనాఁటింటివాఁడవు బాంధవుఁడవు" అనేదే వక్కాణిస్తుంది. ఆనందించక అసూయపడి విచారించవలసివస్తే శ్రీనాథుని విజయానికి పాకనాఁటివారుతప్ప యితరనియోగులున్నూ, వైదికులు సరేసరి యావన్మందిన్నీ విచారించవలసివస్తుంది, అందులో "మహి మున్ వాగనుశాసనుండు సృజియింపన్" అని వుండడంచేత నన్నయ్యగారి చుట్టాలున్నూ (వైదికులన్నమాట), మఱిన్నీ “కుండలీంద్రుండు తన్మహనీయస్థితిమూలమై నిలువ" అని వుండడంచేత తిక్కన సోమయాజులుగారి బంధువులున్నూ (ఆర్వేలవారన్నమాట) యెక్కువగా అసూయపడవలసి వస్తుంది. యింతే కాదు. ఆంధ్రకవితాపితామహుఁడుగారి శాఖవారు (నందవరీకు లన్నమాట) కూడా పాకనాఁటివారు తమవారు కారు గనుక విచారింపవలసినవారే అవుతారు.వీరేకాదు. యింకా మఱిచాను. తెనాలిరామలింగకవి అగ్రశాఖికాకోకిలం కనుక శుక్లయజుశ్శాఖానియోగులున్నూ, శ్రీనాథుని యైశ్వర్యానికి విచారింపవలసిన వారే కాని యీక్షణంవఱకు యెవ్వరుగాని యిట్టి విచారానికి భాజనులు కాకపోవడం మన అదృష్టం. రామలింగకవి ప్రథమశాఖవారిలో వైదికే కాని నియోగికాఁడనే పక్షంలో వారికీ విచారం తప్పదు. యింకీ “యి"విచారం అసలు యుక్తమేనా" అనే ప్రశ్నకు జవాబు వుందా? నన్నయ్యగాని, తిక్కన్నగాని, రామలింగంగాని, పెద్దన్నగాని శ్రీనాథుఁడి కాలంలో వున్నారా? లేరుగదా? “అమరపురి" పద్యంలో లేకపోయినా మఱోపద్యంలో "ఈక్షోణిన్నినుఁ బోలు సత్కవులు లేరీనాటికాలమ్ములో" అని వుండనేవుంది. వుండదే అనుకుందాం "పార్థ ఏవ ధనుర్ధరః" యీ మాటకు రాముఁడుగాని రావణుఁడుగాని అశోకుఁడుగాని గుఱిఅవుతారా? భవతు.

శ్రీనాథుని ఆత్మశ్లాఘాపరత్వం మాకు విచారకారకం అంటారా? అనండి. కవులలో తన్నుఁగూర్చి అంతో యింతో వ్యంగ్యంగానో, వాచ్యంగానో కత్థించుకోని (కత్థ శాఘాయాం) వారెవరు? కవికుల గురువు కాళిదాసు “మందః కవియశః ప్రార్థీ" అన్నాఁడు కనుక యీయన్ని పుచ్చుకుందామా? యీ విధంగా రఘువంశంలో వినయాన్నే కనపరిచాఁడు. శాకుంతలంలోనో? “అభిరూపభూయిష్ఠా పరిషదియం. తదత్ర కాళిదాస గ్రథితవస్తునా నవేన నాటకేనోపస్థాతవ్యం" నాఁటిసభలో చాలామంది పండితులున్నారషః అందుచేత కాళిదాసుగారి నాటకంగాని పనికి రాదష? వాచ్యార్థంలోనే కొంత కత్థనం కనపడుతూ వుంది. యిఁక వ్యంగ్యానికి త్రోవదీస్తేనో? పండితులంతగాలేని సభలో అయితే యే కవిదేనా