పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈతి బాధలు

69


కానేకారు. ఇందులో ద్వైతులున్నూ విశిష్టాద్వైతులున్నూ ఆ వాక్యార్థందరికేనా వెళ్లంగలుగుతారు కాని అద్వైతులు చాలా దూరంగానే వుంటారు. యీజైనులున్నూ బౌద్దులున్నూ వేదబాహ్యులుగానే మనవారిమతంలో కనపడతారు. జినుండన్నా బుద్దండన్నా పర్యాయపదాలేకాని పై రెండుమతాలలోనూ యేమాత్రమో అవాంతరభేదం లేకపోలేదు. జపాను చైనాలలో ఆనాండు వ్యాపించిన మతం బౌద్ధమతమే అని తోస్తుంది. ఆమత వ్యాప్తికల్లా ముఖ్యఫలితం అహింస. అది చీనాలో యొక్కడేనావుంటే ఉందేమోకాని జపానులో బొత్తిగాలేదు. యెందుచేత? పడమటిగాలి పూర్తిగా సోఁకడంచేతే, సందేహంలేదు. అందులో ప్రస్తుతం జపాను చైనాలో బాలవృద్ధాతురులనుకూడా హింసిస్తూవుందని పత్రికలలో వ్రాసే వ్రాఁతలు నిజాలేఅయితే బుద్ధభగవానుండికి యీ జపాను శిష్యులవల్ల కలిగేకళంకానికి మితే కనపడదు. అహింసావిషయంలోనే కానివ్వండి. యితర విషయంలోనే కానివ్వండి యేదేనామతమంటూ బోధించవలసివస్తే అది నిరుపద్రవకరంగానే వుంటుంది. తీరా ఆచరణలోకి రావడం తటస్థించాక అది నానావిధాలా మాడి వెట్టితల లేయడానికి మొదలెట్టి తుట్టతుదకు మొట్టమొదటి మూలసూత్రాలకు దూరమైపోయి మతకర్తలను దోషదూషితులనుగా కూడా చేయవలసిందవుతుంది. అంతగా చేదస్తాలకున్నూ పోక బొత్తిగా చేదస్తమంటూ అన్నింటినీ వదలుకోక వకమాదిరిగా కాలక్షేపం చేసుకుపోతే మన ఆర్యమతం పంచ సూనాదోషాలతో కాలక్షేపం జరగనిస్తుంది. యీ దోషాలకు కూడా మనవారు వప్పనేలేదు. యీ దోషాలేవో కొంచెం వివరిస్తాను. “సూనా! అంటే హింస. అది ప్రతిగృహస్టుకున్నూ నాంతరీయకతయాఅంటే యెంత చేయకుండా వుందా మనుకున్నప్పటికీ తప్పనివిధిగా అయిదింటిద్వారా సంక్రమించి తీరుతుందనిన్నీ ఆపాపాన్ని కూడా యేరోజుకారోజు పోఁగొట్టుకోవాలనిన్నీ ఆదోషనివృత్తికై వైశ్వదేవం అనే కర్మని విధించారు. దీన్ని చేసిన వారినే పాకయాజిబిరుదంతో వైదికులు వ్యవహరిస్తారు. యిది చేయనిదే బ్రాహ్మణీకం వుండనేవుండదు. ఆ అయిదింటిలోను వకటి ఛుల్లీ అంటే పొయ్యి, దీనిద్వారా యెన్నో పురుగులు చస్తాయి. రెండు పేషణి’ బహుశః తిరగలి. సన్నెకల్లు, రుబ్బురోలు వగయిరాలు అవుతాయి. వీట్లద్వారా కొన్ని సూక్ష్మజంతువులు చస్తూ ఉంటాయి. ఆట్టేగ్రంథం పెంచటం యెందుకు? మనిషి నడిచేటప్పుడు దారిలోనున్నూ వర్షాకాలంలో పొలాలల్లో నేరేడిచెట్ల సమీపంలో వుండే గట్లమీద ప్రయాణం చేస్తూ వుంటే కోటానుకోట్లు కండచీమలు భూమి యీనినట్టు పరమాణువంత మేరకూడా యెడంలేకుండా వుంటాయి. అక్కడనడుస్తూవుంటే యెన్నో చస్తాయి. అక్కడకీ స్వేదజాలుగా వుండే నల్లులూ పేలూ వగైరాలతో సంబంధంలేకుండా శిషులు పిల్లజుట్లు వగైరా లేర్పఱచుకున్నారు. కాని భార్యలకు శిరోజాలుండక \