పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

752



కవిత్వమూ-బ్రాహ్మణత్వమూ

కవిత్వం-బ్రాహ్మణత్వం ఈ రెంటికీ చుట్టఱిక ముండునా? అనఁగా, కవిత్వసామగ్రిలో బ్రాహ్మణత్వంకూడా వొకటా? అని ప్రశ్నించేవారు యిప్పుడు పలువురున్నారు. దీనిక్కారణం అప్పకవీయం. ఆపుస్తకంలో కవినిగూర్చి వ్రాస్తూ “ధరణీసురుఁడు ప్రశాంతుఁడు" అంటూ ఆరంభించఁబడింది, దానికి యేదైనా సంస్కృతంలో మూలంవుందేమో అని వెదికితే అహోబలపండితుండు “సత్కులీన శ్శుచి ర్దక్ష శ్చందో వ్యాకరణాదివిత్" అని యేదో ప్రాచీనశ్లోకం వుదాహరించాఁడు. అందులో వున్న "సత్కులీన" శబ్దానికి అప్పకవిపద్యంలో వున్న "ధరణీసురుఁడు" తెలుఁగేమో? గుఱికి బారెఁడు హెచ్చుతగ్గుగా అప్పకవిఅనువాదం సరిపోతుంది గాని బ్రాహ్మణేతరులలో చాలామంది (సంస్కృతంలోసహా) కవులుండడంచేత ఆలక్షణనిర్వచనం దోషదూషితం కాకతప్పదు. సత్కులీనత్వమనేది బ్రాహ్మణులకే కాదు, బ్రాహ్మణేతరులకుకూడా కాణాచే, కులోచితధర్మములను చక్కఁగా పాటించే యేకులస్థుఁడుగాని సత్కులీనుఁడుగా వ్యవహరింపఁ బడతాఁడు. అయితే అప్పకవికి బ్రాహ్మణేతరులు కవులుగావుండడం యిష్టంకాదని అతనిపీఠికలోని మఱొక పద్యం తెలుపుతుంది. అతని కాలంనాఁటికి బ్రాహ్మణేతరులలో కవులు లేరేమో అనుకుంటే అదీ పొసఁగదు. కువిందుఁడు, భోజరాజునాఁటివాఁడు. సుప్రసిద్ధ సంస్కృతభాషాకవిగా అతని రచనే సాక్ష్యమిస్తుంది. "హేసాహసాంక! కవయామి వయామియామి” “త్వంకారయుక్తాహి గిరఃప్రశస్తాః ఇతఁడు తంతువాయి (సాలె) కులజుఁడు. కుమ్మరికులస్థురాలు మొల్లకూడా అప్పకవికి పూర్వురాలేకదా. కృష్ణదేవరాయలు అప్పకవికి పూర్వుఁడే అయినా అతని ఆముక్తమాల్యదలో పెద్దన్నగారి పద్యాలు (వంశవర్ణనకు సంబంధించినవి) వుండడంచేత ఆగ్రంథమంతా పితామహుఁడు రచించినట్లే అభిప్రాయపడ్డాఁడు మన అప్పకవి.

వేదశాస్త్రముల విషయంలో బ్రాహ్మణేతరులలో సుప్రసిద్దులు మృగ్యులుగాని కవితారచనలో మృగ్యులుగారు. వేదానికి స్వరబాధ, శాస్త్రానికిదురవగాహత్వపీడ యివి అధికారిమృగ్యత్వహేతువులు. అప్పకవిపద్యంలో వున్న “ధరణీసుర" శబ్దం లక్షణయా ద్విజత్వపరం చేసికొని సమన్వయించుకుందా మన్నాభట్టుమూర్తివగైరాలు శూద్రులుగానే పరిగణింపఁబడతారు. భటరాజులకు యజ్ఞోపవీతా లున్నా ఆచారాలు శూద్రాచారాలే.