పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యలక్ష్మి

749

అనే పద్య తాత్పర్యంలో గ్రంథకర్త తాత్పర్యం పూర్తిగా యేకీభవిస్తూవున్నట్టు యెన్నో అక్షరాలవల్ల గోచరిస్తుంది. మొదట జగన్మోహనరావును చెడదీసిన బాలవితంతువునుగూడా తుదకు బాగుజేసినపద్ధతి మన ప్రాచీన నాటక సంప్రదాయంగా కనబడుతుంది. అప్పుడు పశ్చాత్తాపం పుట్టడంకూడా కొంత అభినందనీయమే కాని అంతమాత్రంచేత అట్టిస్త్రీలకు మన పూర్వనాగరికత సంఘంలో చోటు నివ్వదు. కాని ఆపె తత్త్వం కూడా అసలు మంచిదే అయినా యీ నాటకకళావ్యామోహంచేత చెడ్డట్టు వ్యంగ్యమర్యాదయా తేల్చినట్లయింది. యీలా విమర్శించి తేల్చవలసివస్తే యెన్నో విశేషాలు యీ రాజ్యలక్ష్మిలో బయలుదేఱతాయి. మొత్తం మాత్రం దీనివల్లతేలేసారం కులస్త్రీలు నాటకరంగాలకు పనికిరారు. అనఁగా నాటక రంగంలో యితర పురుషులతో ఆయాభాగాలు నటించినపిమ్మట శీలాన్ని చెడగొట్టుకోకుండా వుండడం కలలోవార్త అనేదే యిందు తెలుసుకోదగ్గది. శీలమే అక్కఱ లేదు కులస్త్రీల కనేవారుతప్ప తదితరులు యీ భావాన్ని శిరసావహిస్తారు. కనక యీ నాటకము సామాన్యంగా అన్ని పక్షాల వారికిని ఆమోదపాత్రమని నే నభిప్రాయపడతాను. -

ఆయీ గ్రంథకర్త అభిప్రాయాన్ని వ్యాసాలమూలకంగా బోధించడంకన్న దృశ్యప్రబంధమూలకంగా బోధించడంలో చాలా సౌలభ్యం వుంది. వెనక శ్రీకృష్ణ మిశ్ర అనే మహావిద్వత్కవి శిష్యుఁడికి వేదాంత వాసన బొత్తిగా పట్టకపోవడానికి చాలా విచారపడి తుదకు దృశ్యప్రబంధమూలకంగానే శిష్యుణ్ణి బాగుచేసినట్లు వినికి. దానిపేరే “ప్రబోధ చంద్రోదయం." యీ యువకవి మాగ్రామ సమీపంలోవున్న రాజమండ్రీ నివాసియే అయినా నిన్న మొన్నఁటిదాఁకా నాకీయనతో పరిచితిలేదు. సుమారు వత్సరన్నఱనాఁడు నేనూ గురువుగారున్నూ వాదోపవాదాలు ప్రకటించుకుంటూ వున్నప్పుడు మా మా లోపాలోపాలను యెరిఁగి వుండిన్నీ యెందఱో పెద్దలు మౌనంవహించి "మన కెందు" కని వూరుకున్న సమయంలో తల కంటగించుకొని సాహసించి యీయన "గాండీవ" పత్రికలో - "పరువా? ప్రతిష్ఠయా" అంటూ పెద్దశీర్షిక పెట్టి కొన్ని మందలింపు వాక్యాలను వ్రాసి వున్నారు. ఆ వ్యాసంలో యేశతాంశమో "జయంతి" లో వుదాహరించికూడా వున్నట్లుజ్ఞాపకం. చెప్పొచ్చేదేమిటంటే? సత్యం వచించడంలో యీయనకు సాహసం చాలా మెండు. వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, అనే సంకోచం లేదు. వున్నదున్నట్టు వ్రాయడమే యీయనపని. వెనకటిరోజుల్లో శ్రీ కం. వీ. పంతులుగా రొకరు యిట్టి సాహసం కలవారుండేవారు. మళ్లా ప్రస్తుతమీయన కనపడుతూన్నారు. ఆలాటిసాహసమే లేకపోతే