పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/644

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

748

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తనపొరపాటుకు పశ్చాత్తాపపడుతుందని చెప్పడానికి వీలులేదుకాని పాశ్చాత్య విద్యావ్యాసంగంలో ఆరితేరిన యీ నాగరిక కవిశిఖామణి వ్రాసినదగుటచేత యీ సాంఘిక నాటకము అస్మదాదులు వ్రాసేదానికంటె యెక్కువ లోకాదరానికి పాత్రంకాగలదని నానమ్మకం.

యీ నాటకంలో యెక్కడాకూడా "పేకేజీ" సరుకు నాకు కనిపించనేలేదు. ప్రధానపాత్ర రాజ్యలక్ష్మీ శీలమును యెంతచక్కఁగా కాపాడవలెనో, అంత చక్కఁగానూ కాపాడుతూ కూడా భర్తప్రవర్తన అన్యథాగా వున్నప్పుడు భార్యాప్రవర్తనకు భంగం కలగడానికి వుండే అవకాశాలను మిక్కిలీ చక్కఁగా కనపఱిచిన యీకవినేర్పు చాలా ప్రశంసనీయం. అనేక గాథలు వున్నప్పటికీ అంతర్నాటకానికి సారంగధర చరిత్రను పుచ్చుకొని జగన్మోహనరావుకు బుద్ధి చెప్పడం యెంతేనా వర్ణనీయం. జగన్మోహనరావు తల్లిగారి అంత్యదశలో అతణ్ణి ఖండాంతరానికి పంపడం వగయిరాలు ప్రస్తుతకాలంలో పుత్రవంతు లనిపించుకొనే వారికి చెప్పినట్లయింది. రాజ్యలక్ష్మి శీలసంరక్షణవల్ల పురుషులలో వున్నంత అవినీతి యిప్పటికిన్నీ మన భరతఖండంలో స్త్రీలలో లేదనిన్ని వాళ్లమూలకంగానే భరతఖండపు యోగ్యత యింకా అంతో యింతో నిల్చివుందనిన్నీ స్ఫురింపచేసి నట్లయింది. యీ అంశం వాచ్యంగాకూడా గ్రంథకర్త తేల్చివున్నాడు.

ఆంధ్రనాటకాలు ప్రారంభించి సుమారు యాభై, అఱవై యేళ్లు కావచ్చిం దనుకుంటాను. పురాణకథలను యితివృత్తంగా పుచ్చుకొని కొందఱు నాటకాలు వ్రాసివున్నారు. యేకొందఱో స్వకపోల కల్పితగాథలు పుచ్చుకొని కూడా వ్రాసివున్నారు. ఆయా నాటకాలన్నీ అభినందనీయాలుగానే వున్నాయి, కాని యేవొక్క వాక్యంగాని వ్యర్థంకాకుండా సార్థకంగానే వున్న నాటకాలు స్వతంత్ర రచనలలో దొరకడం కష్టసాధ్యం. సంస్కృత రచనలలో వుండడాని కభ్యంతరంలేదు. అందులో శాకుంతలమంటే ఉత్తర రామచరిత్రమంటే సరేసరి. మృచ్ఛకటికమాట చెప్పనే అక్కఱలేదు. మన బంగారయ్యగారి నాటకరచనకు పునాది యిప్పటినవనాగరికుల తొందరపాటు కృత్యాలే అని నేననుకుంటాను. వారివారిని చక్కని మార్గంలోకి తిప్పడానికి గ్రంథకర్త చేసిన వుపాయము మిగుల కొనియాడ దగినది. పోతరాజుగారి-

ఆ. వె. పొలఁతి దావవహ్ని పురుషుఁ డాజ్యఘటమ్ను
        కదియకుండరాదు కదిసెనేని
        బమ్మయైనఁ గూఁతుఁ బట్టకమానఁడు
        వటున కింతిపొత్తు వలదు వలదు!