పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/638

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

742

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


లోకోత్తరమైన కవిత్వంగా పరిణమించడమంటూ వుంటుందా? అనుకున్నాను. మళ్లా ఆలోచించుకొంటే యీవిధంగా తోచింది. యేమీ? కరుణాశూన్యులైన బోయవాళ్లు చేసే ఘోరకృత్యాలు చూచి యెంతమంది దుఃఖించరు, వాళ్ల దుఃఖమంతా వాల్మీకి దుఃఖంవలెనే రామాయణంగా పరిణమించిందా? లోకమంతా కవి యెన్నటికీ కానేరదు. కొండల్లోపుట్టే రాళ్లన్నీ వజ్రాలవుతాయా? కావు. కవికి అనుభూతమైన రోగమే కాదు, భోగమే కాదు, త్యాగమే కాదు, ఆగమేకాదు, యాగమే కాదు, రాగమేకాదు, యోగమే కాదు, సర్వమూ కవిత్వంగానే పరిణమిస్తుందని నేనప్పుడప్పుడు అనుకుంటూ వుంటాను. దీన్నియేకొందఱో విశ్వసిస్తారు. కాని సర్వే సర్వత్ర విశ్వసింపరు. ఆయీ నాభావాన్ని మాబుచ్చిసుందరరామయ్య మాధవపెద్ది బలపఱచినందుకు ఆనందిస్తూ అతణ్ణి బాధిస్తూవున్న వుబ్బసం యిఁకముందు శత్రువునైనాసరే యెవణ్ణీ కూడా బాధించకుండా వుండడానికి శ్రీమృత్యుంజయుణ్ణి నేనుకూడా ప్రార్ధిస్తూ వున్నాను. నేను స్వయంగా కాకపోయినా (ఆత్మావైపుత్రనామాసి) ఆయీపీడ అనుభవించినవాణ్ణే. కొంత కవిత్వం చెప్పినవాణ్ణే. కాని మాశిష్యుఁడి కవిత్వానికీ నాదానికీ యెక్కడికెక్కడ? నాపద్యం వుదాహరించి పిమ్మట మాశిష్యునికవిత్వాన్ని వుదాహరిస్తాను. -

మ. తమకుం దగ్గని దానిఁ గోరుదురు సంతానంబు నెప్పట్లఁ బ్రా
     జ్ఞమతుల్ దగ్గెడిదాని నెట్టి కుమతుల్ గాంక్షింప రట్లౌటనో
     యమ? యిందుం గలశ్లేష శ్లేష్మరుజయందైనన్ సమర్ధించినా
     కొమరున్ దగ్గనివానిఁ జేయు మది నాకున్‌జాలుఁ గామేశ్వరీ.

సుందర రామయ్యపద్యం చూడకుండా దీన్ని చూస్తే యిదిన్నీ కొంత బాగానే వుంటుంది. యిందులో తగ్గనిదానిన్ దగ్గనిదానిన్ శ్లేష శ్లేష్మ ఇత్యాదులలో కొంత చమత్కారం లేకపోలేదు. యిఁక శిష్యుని ఉబ్బసం చూడండి. యెప్పుడో మా తిరుపతిశాస్త్రి యెవరినో హేళన చేస్తూ, "దగ్గో? కవిత్వమో? తాత్కాలికంబగు సన్నిపాతంపుఁ బ్రసారమొక్కొ" అన్నాఁడు. ఇప్పటికి మాసుందరరామయ్యదగ్గు మంచికవిత్వంగా పరిణమించి అతని వెక్కిరింపునకు భంగం తెచ్చింది. తెస్తేతెచ్చిందికాక, వాణ్ణిబాధిస్తే బాధించిందిగాక మంచికే కారణ మయింది చూడండి యీపద్యం.

మ. సరిలే మానవకోటియీవెలుపలన్ సంసారచక్రాననే
     దొరలన్ లేకిటులుండ, లో నొకటి రెండున్ గావు షట్చక్రముల్
     వరుసం బేర్చి బిగించినావు గద అబ్బా నాగపాశాలతో
     దరియింపన్ వశమౌనె? నీకరుణచేతంగాక మృత్యుంజయా.