పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/636

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

740

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చూచేవారు. నాకంటే సుమారు పదేళ్లు ఆయన పెద్ద. నావలెగాక యావజ్జీవమూ బలిష్ఠుఁడుగా, సుఖిగా కాలం వెళ్లబుచ్చిన మహనీయుఁడాయన. చెప్పొచ్చే దేమంటే : దాసుగారు కూడా త్యాగయ్యగారి వలెనే రచనాశక్తి కలవారైనా, వారి పంక్తిలో చేరుటకు సందేహిస్తారు. కొందఱు "ఏకవిద్యా సురక్షితా" అన్న శ్లోకానికి వుదాహరణంగా వేదమో, శాస్త్రమో కృషిచేస్తారు. వారితో దానిలో వాదోపవాదాలు పెట్టుకుంటే చాలా విద్యలలో కృషిచేసినవారు వోడిపోతారు.

పూర్వకాలంలో “సుబ్బత్రయ" మంటూ వుండేవారు. వారిలో ఒకరు తనికెళ్ల సుబ్బన్నశాస్త్రులుగారు. వీరు తర్కశాస్త్రంలో ప్రత్యేకించి కృషిచేశారు. యీ పేరు కలవారే యింకొకరు అక్షంతలవారు. యింకొకరున్నారు గాని వారింటిపేరు సమయానికి జ్ఞప్తికి రాలేదు. యీ ముగ్గురిలో ఒక్కరికి యింకొక్కరు తీసిపోరు. కాని నవద్వీపంలో (యీ వూరు కలకత్తా ప్రెసిడెన్సీ) యేమో చెప్పలేం. యితరత్ర వాదనసమర్థులు లేరని చెప్పుకుంటారు. తనికెళ్లవారికీ, కొవ్వూరిగోపాలశాస్త్రుల్లు (యీయన షట్ఛాస్త్రవేత్త) గారికీ లేటు శ్రీ పిఠాపురంరాజావారు వాదోపవాదాలు పెట్టినప్పటి గాథ కొలదివత్సరాలనాడు యేదో వ్యాసంలో వ్రాసే వున్నాను.

రచయితలు యేవిధంగా వుంటారో, రచనామాత్రం దానికి సాధకమైనా గద్యపద్యాత్మక రచనే సాధకంగాని తాళరాగయుక్తమైన రచన సాధకం కాదని వ్రాస్తూ, యెందుకు కాదో నాకు తెలిసినంతలో వివరించాను. ప్రకృతకాలంలో శ్రీయుతులు హరినాగభూషణంగారు గానం ప్రధానంగానూ, సంస్కృతాంధ్రభాషలే కాక యింగ్లీషుకూడా అప్రధానంగా కృషిచేసి సంస్కృతాంధ్రాలలో కొంతరచన సాగించినవారే. పనిపడితే యీయన ఫిడేలుతో సభకు వస్తారుగాని, కలమూ, కాగితంతోటీ రారు. అభిమానించి యీయన్ని రచయితల పంక్తిలో చేర్చి నాల్గుమాటలు అభినందన ప్రయుక్తాలే అందాం-వ్రాస్తే, ఆయన అంతరాత్మ సంతసింపదనే నేను అనుకుంటాను.

“పిళ్లః కవి రహం విద్వాన్" అన్నారట అప్పయ్యదీక్షితులు. పిళ్లంటే వేదాంతదేశికులు, కవితార్కికసింహః, ఈయన అప్పయ్యదీక్షితులవంటి విద్వాంసుఁడు కాడా? ఆయన వేదాంత దేశికులవంటి కవిన్నీ కాడా? ఉభయులయందున్నూ ఉభయప్రజ్ఞలూ కేంద్రీకరింపఁబడి వున్నా, వారివారికి అభిమానవిద్యలు వేఱుగా వుంటాయి. యేదో కొంచెం వ్రాసి ముగించాలనుకుంటే కొంత చేదస్తంగా పెరిగినట్లుంది. చదువరులుక్షమింతురుగాక. పూర్వంకన్న వ్యావహారికభాషకు శృంఖలాలు తెగినతర్వాత రచయితల సంఖ్య పెరగడం ముదావహమ్. “అస్మద్గోత్రం వర్ధతామ్."

★ ★ ★