పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/635

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రచయితలు

739

ప్రకృత మేమిటంటే, నేను సంగీతం అభ్యసించడమంటూ వస్తే స్వస్వరూపాన్ని గోపన (కర్ణుఁడు మాదిరి) చేయవలసి వస్తుంది. అది యే కొలదికాలమో దాగినా 'యింగువ దొంగతనం'గా పరిణమిస్తుందేమో అని భయపడి మానుకున్నాను. ఒకవేళ ఆయాచిక్కులన్నిటికీ అంగీకరించి, గాయకాగ్రేసరుఁడుగా తయారైనా గతంలో వున్న కవిత్వ ప్రయుక్తమైన నామరూపాలకంటె యెక్కువ నామరూపాలు దీనివల్ల కలగవు- అని ఆయీ వుద్యమాన్ని విరమించుకున్నాను.

సారాంశ మేమంటే : త్యాగయ్యగారు రచయితల పంక్తిలో కూర్చోవడానికి తగ్గ ప్రజ్ఞా విశేషం కలవారే అయినా, వారి ప్రధానవిద్య (గానం) అందుకు అంగీకరించదు. ఆలాగే- 'గోచివెట్టకమున్న వచ్చిన కవిత్వం' నాకున్నూ అడ్డు తగులుతుందని భయపడ్డానంటే విశ్వసించనివా రుండ రని భయపడుతూ వ్రాస్తున్నాను. త్యాగయ్యగారు గద్యంగాని, పద్యంగాని అస్మదాదులకంటే హృద్యంగానే కట్టగలరు గాని, వారికి అంతకుమున్ను స్వాధీనపడివున్న గానం దీనికి ప్రాధాన్యస్థితిని రానీయదు. అస్మదాదులవంటి రచయితలు యెన్ని కోట్లయినా వొక త్యాగరాయలు కారన్నది పరమార్థం. ఆ మహానుభావుణ్ణి గౌరవించడానికి మనం రచయితల పంక్తిలో స్థానం కల్పించడం సదుద్దేశ ప్రయుక్తమే అయినా, తుదకది అన్యథాగా పరిణమిస్తుంది కనక, వారికి యీ స్థానం వద్దంటాను నేను. లోగడ వికారి సంవత్సరంలో కాసీంకోట జమీందారుగారి తోబుట్టువు వివాహానికి శ్రీయుతులు పోలవరపు జమీందారుగారు, కిర్లంపూడివారు లోనైన జమీందార్లు, యింకా మఱికొందఱు విచ్చేశారు. దానికి కిర్లంపూడి వారితో మేం (తి. వెం.) కూడా వెళ్లడం తటస్థించింది. హరికథా పితామహుఁడు నారాయణదాసుగారు కూడా వచ్చారు. దాసుగారిని వినడమేగాని, అప్పటికి మేం చూడలేదు. ఆయనతో యెవరు యే విధంగా చెప్పి వున్నారో తెలియదు, మమ్మల్ని యీవిధంగా ప్రశ్నించారు ఆయన "ఏమయ్యా, వేంకటశాస్త్రీ, మీరు నన్ను కవిగా అంగీకరిస్తారా? గాయకుఁడుగా అంగీకరిస్తారా?" అని ప్రశ్నించేటప్పటికి "మీరు హరికథ కాగ్రేసరులు, హరికథకులకు గానప్రజ్ఞా వుండాలి, కవనప్రజ్ఞా వుండాలి. యింకా చాలా ప్రజ్ఞలు వుండాలి. మీరు అన్ని విద్యలకూ నివాసస్థానంగా మాబోట్లు చెప్పుకుంటారు". ఈరీతిగా యెన్నిసార్లు నిష్కపటంగా నేనుచెప్పినా అలాకాదు, యేదోవొక విద్యను నిర్ధారణచేసి చెపితేనే గాని నామనస్సుకు సంతుష్టిలేదు, అని పట్టుకొని వేధించేటప్పటికి గత్యంతరంలేక 'మీకు నిరుపమానత్వం రావలెనంటే గానంలో వస్తుంది గాని, కవనంలో రాదు. కారణం కవులలో మీవంటి వారు మఱికొందఱు దొరుకుతారు. గానంలోనో, మీ గాత్రమువంటి గాత్ర మాధుర్యం 'న భూతో న భవిష్యతి' అనేటప్పటికి ఆయనకు చాలా కోపం వచ్చింది. తోక తొక్కిన పాముగా పరిణమించి తిట్టడంకూడా జరిగింది. యిటీవల మళ్లా కొలదివత్సరాలలో స్నేహితులమైనాం. నే నంటే చాలా ప్రేమగా