పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/628

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

732

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

చ. హృదయగతిన్ బురాతన కవీశ్వరు లేగని వీథిలేదు నేఁ
    దదనుగతిన్ రచించుకృతి తాత్త్వికులన్ గరఁగింప కుండునే
    మదగజరాజముల్ చనిన మార్గమునం గడు నింపు నింపవే
    మదగజరాజయానమదమంధర బంధుర యానమానముల్,

ఆ యీ మహాకవి ఆక్షేపకులకు చక్కని సమాధానం చెప్పినాఁడు. ఆ యీ విషయం యిదివఱలో యెప్పుడో చర్చించి విడిచినదే, కనక స్పృశించి విడిచాను. నేను సుమారు పదియేళ్లనుండి యేవోవ్యాసాలు వ్రాస్తూనే వున్నాను. ధారణశక్తి 40 యేండ్లవయస్సు నాఁటికే కొంత తగ్గడ మారంభించింది. 'ధారణ నిల్చునా? నిలువదా?" (బందరు శతావధానం చూ.) యిటీవల 75 వత్సరాల ప్రాయానికి యెంత తగ్గి వుంటుందో ప్రాజ్ఞులు పరిశీలింపఁగలరు. అందుచే [1] పునరుక్తులు పడివున్నాయేమో అని అనుమానం తగులుతూ వుంది.

మళ్లా ప్రధానాంశం అందుకుంటూన్నాను. అందఱికీ ఒకటేవిధమైన అక్షరాలే కవిత్వానికి ఆధారాలుగావున్నా రచనలో కొన్ని రహస్యాలున్నాయి. ఆయాపదాలు కూర్చడంలో వైలక్షణ్యం వుంటుంది. అది ఇదమిత్థం అని బోధించడానికి దొరుకడేదికాదు. అందుచేతే అనుకుంటాను “విచిత్రప్రకారాహి పదానాం ప్రవృత్తిః" అన్నాడు, ఆలంకారిక వామనుఁడు. ఆయీ విషయంలోగల యే వ్యాసంలోనో విస్తరించే వుంటాను కనక స్పృశించి విడుస్తున్నాను. అచ్చంగా తెలుఁగే చెపుతానని కాని, అంతే కాకుండా నిరోష్ఠ్యంగా కూడా చెపుతానని కాని లేనిపోని శృంఖలాలు తగుల్చుకొని కొందఱు రచన సాగించివున్నారు. ఆకాలంలో అట్టి రచనల యందు పాఠక లోకానికి ఆదరం వుండేదేమో అనుకోవాలి. యితరులమాట అలావుంచుదాం. కవిబ్రహ్మంతవానికి కూడా కొంచెం ఆయీ విధమైన

  1. నేను వ్రాసిన వ్యాసాల పత్రికలు యే కొన్నో తప్ప చాలావఱకు పత్రికాఫీసులలోనే తప్ప నావద్దలేవు. కొందఱు భాషాభిమానులు ఆయీనావ్యాసాలు సంపుటాలుగా ప్రచురించే వూహతోవున్నట్టు వింటాను. అది సుఖ సుఖాల నెఱవేరేపనికాదు. ద్రవ్యంమాటలావుండఁగా ఆయీ వ్యాసాలు సేకరించడం చాలాశ్రమతో చేరినపని. ముఖ్యంగా నా వ్యాసాలు - (1) ఆంధ్రవారపత్రిక (2) కృష్ణ (3) భారతి (4) త్రిలింగ (5) ఆంధ్రవాణి యీ అయిదింటిలో పడివున్నాయి. ఆంధ్రదినపత్రికలో కూడా యీ మధ్య కొన్ని పడ్డాయి. యే వొకటి రెండో ఆంధ్ర ప్రభకు పంపినట్లు జ్ఞాపకం. అభినవ సరస్వతిలో అప్పుడప్పుడు పడడం కలదు. ఆ యీ సరస్వతి ఆంధ్రవారపత్రికనుండి గ్రహించి ప్రచురించడమే తఱుచుగా వుంటుంది. ఆంధ్రలోకూడా యేవొకటి రెండో పడ్డాయి. ఆయీ వ్యాసాలు గ్రంథరూపంగా ప్రచురించేవారు - పునరుక్తులుగా వుండే సందర్భాలు పరిశీలిస్తారని నాయాశ. వారికీ యంశం తెలిసివుండడం మంచిదని యీ రెండు మాటలూ ప్రసక్తిగాని ప్రసక్తిగాదీనిలో వ్రాశాను.