పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యేది కవిత్వం - 2

731

ఆ యీ పద్యం మనస్సులోవున్న భక్తులకు శ్రీకృష్ణమూర్తి ఆకారం సార్వకాలికంగా గోచరించడాని కభ్యంతరం వుంటుందా?

ఉ. నంద తపఃఫలమ్ము సుగుణమ్ముల కందము గోపకామినీ
    బృందము నోముపంట సిరివిందు దయాంబుధి యోగిబృందముల్
    డెందములందుఁ గోరెడికడింది నిదానము చేరవచ్చెనో
    సుందరులార! రండు చని చూతము కన్నుల కోర్కి దీరగన్.

అందఱికీ కంఠోపాఠంగా వుండే పద్యాలని చెపుతూ వుదాహరించడం పునరుక్తిగా పరిణమిస్తుందని యెఱిఁగిన్నీ వుదాహరించడానిక్కారణం నాదోషంకాదు. మురారి, “సతుగుణగణానామపగుణః" అనలేదా? అందుచే విజ్ఞులు క్షమిస్తారు. యెవరు కవిత్వం చెప్పినా యాభై యాఱక్షరాలలోనే. ఒక్కొక్కరి వాణిలో ఒక్కొక్క విధంగా రసం ప్రసరిస్తుంది. రచించే కవికి తన రచన భవిష్యత్కాలంలో లోకానికి యేవిధంగా రుచిస్తుందో తెలియనే తెలియదు. తన్మయుఁడై రచించుకుపోతాఁడు. తక్కిన భారమంతా లోకానిది. భవతు-తెలుఁగు కవులలో పలువురు మహానుభావులు - కవిత్వభిక్షపెట్టినవారు (సీ|| “నన్నయకవి పెట్టినాఁడు కదా? తిక్కనాదికవీంద్రుల కాదిభిక్ష" చూ.) వున్నా అందులో పలువురు ప్రాచీనులే అయినా, వారి రచనల ననుసరించే పోతన్నగారు రచన సాఁగించినా, లోకాదరవిషయంలో అగ్రతాంబూలం పోతరాజుగారికి యివ్వాలని నే ననుకుంటాను-

"క. వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా" అనే పద్యానికి మాతృక

క. వీరెవ్వరయ్య? ద్రుపదమ
    హారాజులె? యిట్లు కృపణులై పట్టువడన్
    వీరికి వలసెనె? యిపుడు మ
    హా రాజ్యమదాంధకార మదివాసెనొకో?"

అనే పద్యమే కానివ్వండి. నన్నయ్యగారి కన్న పోతన్నగారు పూర్వుఁడే అయేపక్షంలో మాత్రం ఆ ఘట్టంలో ఆ యీ పద్యం పోతన్న గారికి నడిచివుండదా? చట్టన “గ్రంథచోరులుగాని కవులుగారు” అని యీసడించేవారు లోకంలో పలువురుంటారు. వారు ఆ యీ సందర్భాలు కొంచెం పరిశీలించాలి. నే నెవరినీ అనుసరించనని ప్రతిజ్ఞపడితే అది నెగ్గదు. యేమంటే? బుద్ధిపూర్వకంగా కాకపోయినా, యాదృచ్ఛికంగానేనా అనుసరించినట్లు ప్రత్యర్థులు ఋజువుచేస్తారు. అందుకే అనుకుంటాను సంకుసాల నరసింహకవి ఇలా అన్నాఁడు.