పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/618

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

722

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

(యీ పద్యానికీ, ఆకొండి రామమూర్తిగారికీ, యింకొక వ్యక్తికీ సంబంధించిన చరిత్ర మఱొకప్పుడు వ్రాస్తాను.) యీ మాదిరి పద్యాన్నే చదువుతాఁడుగాని,

సీ. జనకనేత్ర ఫలంబయిన పాలపాపఁడు
               వరవృద్ధిగాంచు జై వాతృకుండు.

యీ మాదిరి పద్యాన్ని చదవఁడు. ఆ పద్యం మాత్రం సరసమైనదికాదా? అంటారేమో! సరసమైనదే. అయినా మొదటిదానివంటిదిగాదు. చదివేటప్పటికల్లా అర్థస్ఫూర్తి కలుగుతూ వుంటేనేగాని ఆలాకాని పక్షంలో ఆ పద్యం యెంతరసవంతమైన దైనా సహృదయ హృదయాకర్షకం కాఁజాలదు. ఆముక్త మాల్యదలో ఎంతో అలంకారపు సరుకు వుంది. పాకం నారికేళపాకం. అందులోనున్నూ కూర్పు డొంక తిరుగుడుకూర్పుగా వుంటుంది గాని, సరళంగా వుండదుకూడాను - అయినప్పటికీ కొన్నిపద్యాలు రసస్ఫోరకాలుగా యేలా పడ్డాయో పడ్డాయి. వాట్లకోసమే ఆ గ్రంథాన్ని చదవవలసి వస్తూవుంటుంది. "నక్షత్రతారాగ్రహసంకులా౽పి జ్యోతిష్మతీ చంద్రమసైవ రాత్రిః" అన్నాఁడు కాళిదాసు. ఆపద్యాలు కొంచెం రుచిచూపుతాను.

తే.గీ. సంగతియె యోయి! యిసుమంత టింగ ణావు
      తత్త్వనిర్ణయవాదంబు తరమె? నీకు
      ఓడితేనియు వద్దు మొఱ్ఱో యనంగ
      లింగమును గట్ట కుడుగ మెఱింగి నొడువు.

యింకా యీ ఘట్టంలో మఱి మూఁడు నాలుగు పద్యాలు యిదే పాకంలో నడిచిన వున్నాయి. యిది ద్రాక్షాపాకం. నారికేళపాకంలోకూడా కొన్ని యీలాటియెన్నికకు వచ్చే పద్యాలున్నాయి. కొంచెంచూపుతాను. -

మ. తలఁ బక్షచ్చటఁ గ్రుక్కి బాతువులు కేదారంపుఁగుల్యాంతర
     స్థలి నిద్రింపఁగఁ జూచి ఆరెకు లుషస్నాత ప్రయాతద్విజా
     కళిపిండీకృతశాటు లంచవి తదావాసమ్ములం జేర్పరే
     వులడిగ్గన్ వెసఁబాఱువానిఁగని నవ్వున్ శాలిగోప్యోఘముల్,

యీ పద్యంలో కవిత్వానికి పరమావధిగాఁజెప్పే యావత్తు యోగ్యతలూ పుంజీభవించి వున్నాయి. యిమిడికకు వుదాహరించవలసివస్తే ఆంధ్రకవితా ప్రపంచంలో దీనికి అగ్రతాంబూలం తప్పదు. గ్రంథ విస్తరభీతిచేత యింకా వుదాహరించవలసినవి ఈలాటివి మఱికొన్ని వున్నా విరమిస్తున్నాను. శా. ఆనిష్ఠానిది గేహసీమ నడురేయాలించినన్ -