పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/614

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

718

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

యింతకంటే చెప్పఁదగ్గవా ళ్లెవళ్లుంటారు? యీలా ఖండితంగా చెప్పినప్పటికీ పాపం యెందఱో వృథాగా పరిశ్రమచేసి "కాగితాల్ వృథా చేసి కవిత్వ మల్లిన రుచించునె? అయ్యది గడ్డిపచ్చడిం జేసిన యట్టులుండు" అనే మా నానారాజసందర్శన పద్యభాగాన్ని స్మరింపఁజేస్తూ వుంటారు. ఆ యీ విషయంలో యెందఱో వారివారి అభిప్రాయాలు విస్తరించి వున్నారుగాని యెందఱెన్నివ్రాసినా నిజమైన మార్గాన్ని తెలుసుకొని కవిత్వాన్ని నడిపించేవారుమాత్రం మిక్కిలీ మృగ్యంగానే కనపడతారు. ఆలాగేకాకపోతే “పండుగునాఁడూ పాతమొగుడే" అన్నట్లుయెన్నో శతాబ్దాలు గడిచిపోయినా ఆకాళిదాసే ఆభవభూతే ఆనన్నయ్యభట్టే ప్రత్యక్షం కావడానిక్కారణం యేమిటంటారు? ఆకవిత్వాలు జీవనదులవంటి జీవకవిత్వాలు కావడమే తప్ప మఱివక కారణం వుండదు.

“మలయమారుతములరీతి మలయవలయు" అని బుద్ధభగవానుఁడు యేదో సందర్భంలో చెప్పివున్నాఁడు. దాన్ని మనం కవిత్వవిషయంలో వుపయోగించుకుందాం. బడబడమంటూ కంకరరాళ్లమీఁదవెళ్లే బండిలాగునడిచేకవిత్వాన్ని సహృదయులు మెచ్చుకోరు. ఆ సంగతిని యెవరో వొక మహాకవి యీ విధంగా తెలుపుడు చేశాఁడు.

శ్లో. ఘటః పటఇతి స్ఫుటం పటు రటంతి నై యాయికాః
    పఠంతిచ హఠాత్తరాం ఖఫఛటేతి పాతంజలాః
    వయం వకుళమంజరీ గళదరీణ మాధ్వీఝరీ
    ధురీణ శుభరీతిభిః ఫణితిభిః ప్రమోదామహే.

యీ శ్లోకంలో పూర్వార్థరచనకున్నూ ఉత్తరార్థరచనకున్నూ వున్న భేదం గమనిస్తే సర్వమూ తేలిపోతుంది. గాని ఆ భేదాన్ని గమనించే వారు మృగ్యులుగా వుంటారు.

శ్లో. విపశ్చితా మపశ్చిమే వివాదకేళినిశ్చలే
    సపత్నజి త్యయత్న మేవ రత్నఖేటదీక్షితే
    బృహస్పతిః క్వ జల్పతి క్వ సర్పతి ప్రసర్పరా
    డసన్ముఖశ్చ షణ్ముఖ శ్చతుర్ముఖశ్చ దుర్ముఖః.

అని చదవడంతోటట్టే కొందఱు కవిత్వమంటే యీలా వుండాలిగాని

తే.గీ. కుందనమువంటిమేను మధ్యందినాత
      పోష్ణహతిఁ గందె వడఁదాకె నొప్పులొలుకు
      వదన మస్మద్గృహమ్ము పావనముఁ జేసి
      బడలికలు వాసి చనుమన్న బ్రాహ్మణుండు.