పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/613

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యేది కవిత్వం - 1

717

యీ మాదిరి పద్యాలు భగవంతుని తేజస్సు మాదిరిగా స్వయంప్రకాశకాలు. అంటే, శ్లేష వగయిరాల ఆపేక్షలేకుండానే సహృదయాహ్లాదకాలుగా వుంటాయన్నమాట.

ఉ. మ్రొక్కిన నెవ్వ రేమనఁడు మోమటు వెట్టుక చక్కఁబోయె నీ
    దిక్కును జూడఁడాయె నొక దీవనమాటయు నాడఁడాయె వీఁ
    డెక్కడివైష్ణవుండు మన మేటికి మ్రొక్కితిమమ్మ అక్కటా!
    నెక్కొని వెఱ్ఱిబుద్ధిమెయి నిద్దురఁబోయినవానికాళ్లకున్.

చ. ప్రకట జితేంద్రియల్ మును పరాశరకౌశికులంతవారు స్త్రీ
    లకు వశు, లంతకన్న మిగులన్ దృఢమౌ మగకచ్చ బిగ్గఁగ
    ట్టుకొనఁగ నీతఁడెంత శుకుఁడో! హనుమంతుఁడొ! భీష్ముఁడో వినా
    యకుఁడొ! తలంచుకో సరసిజాయతలోచన! నెమ్మనమ్మునన్,

యీ ఘట్టమంతా యిదేమాదిరిగా వుంటుంది. వీట్లకు వెల చెప్పవలసివస్తే స్వర్గాన్నుంచి యెవరో దిగిరావలసిందేగాని అస్మదాదులవల్ల అయేపనికాదు. యిందులో శబ్దవైచిత్ర్యంగాని శ్లేషాది అర్థవైచిత్ర్యంగాని లేదు, యిఁక యేమిటి వుంటా? అంటే : కవిత్వంమాత్రమే వుంది. “ఇయ మధికమనోజ్ఞా వల్కలేనా౽పి తన్వీ" అనే తెగలోవి యీ పద్యాలు, యీ పద్యాలు మాత్రమే కాదు, యీ వైజయంతీ విలాసం యేభాగంతీసి చదివినా యీలాంటిపాకంలోనే వుంటుంది.

మ. అకలంకస్థితి నాఁటనుండియును శూద్రాన్నంబు వర్జించి మా
     ధుకరప్రక్రియ బ్రాహ్మణాన్నమె భుజింతున్, గానిచో వైష్ణవ
     ప్రకరంబిండ్ల గులాము సేయుదు స్వయంపాకంబు శ్రీరంగ శా
    యికృపన్ వెళ్లే దినమ్ము లీక్రియను స్వామీ! నేఁటిపర్యంతమున్.

యీలాటికవిత్వం యెన్నిజన్మాలో చేసిన పుణ్యపరిపాకం వున్నవాళ్లకుఁగాని సంఘటించదు. దీన్ని సమన్వయించుకోవడానికి నిఘంట్లు వగైరాలతో లేశమున్నూ ఆవశ్యకం వుండదు. ద్రాక్షాపాకమంటే యిదే. వందపద్యాలకి వొకపద్యమేనా యీలాంటిది వుండని పద్ధతిని కవిత్వం చెప్పడానికి సిద్ధపడడంకంటే అవ్యక్తత్వం మఱోటి వుండదని పూర్వమహాకవులు నిర్మొగమాటంగా మొఱపెట్టివున్నారు.

శ్లో. నాకవిత్వ మధర్మాయ
    మృతయే దండనాయవా;
    కుకవిత్వం పున స్సాక్షా
    స్మృతి మాహు ర్మనీషిణః.