పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

712

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పోయినాయిగాని మళ్లా ఆలాటిపద్యం ఆవిర్భవించలేదంటే కాదనేవారయితే కనపడరుగాని దాన్ని కవిత్వంగా అంగీకరించమంటే అంగీకరించేవారున్నూ వుంటారుగాని ఆలాటివారిని రసజ్ఞులంటే మాత్రం తత్త్వవేత్తలువొప్పుకోరు. అంటే? యేమన్నమాట? "కవిత్వమంటే శబ్దాడంబరం కాదన్నమాట". ఆయీసందర్భం చర్చిస్తూ మేము శ్రీనివాసవిలాసంలో “ఉ. కేవలశబ్దముల్ దగ లగించి బిగించినయట్టి సంస్కృతంబు" ... అని యెత్తుకొని, “శుష్కకుచపొంకము బైటకుఁ బెట్టినన్" అని వుపసంహరించవలసి వచ్చింది. కాని ప్రతీకవికీ కవిత్వారంభదశలో యేదో యమకం వచ్చేటట్టు పద్యం వ్రాయాలనే కుతూహలం వుదయిస్తుందని నా అనుభవాన్ని బట్టి వ్రాయసాహసిస్తూన్నాను. “చ. జిలిబిలిపల్కులున్ సొగసుఁ జిల్కెడిముద్దులు” అనే శైలిలో శ్రవణానందాన్ని నడిపిన మాకు మొట్టమొదట యేదో శతకం వ్రాసేటప్పుడు "మగువపదంబు కోకనదమానదమా నదమా” అనే మా ముత్తాతగారిధోరణిలో కవిత్వం నడపాలనేవుండేది గాని పిండి తగినంత లేని బాల్యమవడంచేత యెన్నిమాట్లు ఆధోరణిలో కలం నడిపినా వొకటి రెండు చరణాలు కుదరడమే దుర్ఘటంగా కనపడేది. అర్ధంమాట యేలావున్నా నాలుగుచరణాలూ వొకటే మాదిరిలో నడిస్తేనేకాని చదువరులకు (సామాన్యులకే అనుకోండి) అది అబ్బే అనిపిస్తుంది. మాముత్తాతగారు పడ్డంతకష్టం యీవిషయంలో యెవరూ పడనేలేదేమో అని నాకు తోస్తుంది. రకరకాల యమకాలన్నీ ఆయన కవిత్వంలో కనపడతాయి. ఆ యమకం లేకుండా కూడా యెంతో చక్కఁగా ఆయన చెప్పఁగలరు. కాని “నాన్‌బ్రామిన్సు" ప్రతీపదార్థంలోనూ వుల్లిని కల్పినట్లు ప్రతీపద్యంలోనూ యమకప్రభేదాలలో యేదో వొకటి కల్పడమే ఆయనకలవాటు. కొంచెం మచ్చు చూపుతాను.

చ. ఘనకబరీ స్తనాకృతులు కంధరమై ధరమై రమైక్యమై
    చను మది కంఠవక్త్రములు సాదరమౌ దరమౌ రమౌకమౌ
    దినుసగు వాక్స్మితాంగములు తేనెలతో నెలతో లతోక్తితో
    నెనయగు నాభిజంఘగతి హేమకరిన్ మకరిన్ గరిన్నగున్.

ఆ యీ పద్యాల అర్థం నాకు పూర్తిగా తెలుసును. దానిక్కారణం సంప్రదాయజ్ఞువల్ల వినడమే. కొన్ని పద్యాలకు తెలిసిన తరువాత మఱి కొన్నింటికి దానంతట అదే తెలుస్తుంది. నాలుగోచరణంలో తుట్టతుదను యమకనియమం చెడింది. అంతేకాక సంధివశాత్తూ కరిన్ అనేది గరిన్ అనే వ్రాస్తే అందం చెడవలసివస్తుంది. వొక్క చరణానికి అర్థం వ్రాసి చూపుతాను.