పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/605

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యేది సాధ్యం?

709

"వెం. శా. కి రసచుంబనశక్తితోపాటు లయజ్ఞానంకూడా లేదు" అని మీరు వాదించడానికి పనికివస్తే పనికివస్తుందేమో? హృదయంవిప్పి మాట్లాడేయెడల లోఁగడనే సర్వవిషయాలూ వుటంకించఁబడ్డాయి. అయితే “నాకు తగ్గ సదుత్తరం రాలేదు. ఇఁకముందున్నూ వస్తుందనే ఆశకూడా లేదు" అనే అర్థమిచ్చేమాటలు మీరు వ్రాస్తూన్నారు. యిప్పుడే కాదు, యెప్పుడేనా స్వార్ధనిర్వహణతత్పరులు వ్రాసేమాటలే యివి. మీయందేదేనా వైరంవుండి నేను ఆ “అమ్మా మాదాకవళపల్లవి" కవిత్వం కాదన్నానని చూపిస్తే తప్ప, మీవాదానికి ప్రయోజనం వుండదు. నాపరిశ్రమ తత్ప్రయుక్తంకాదు. సత్యనారాయణకూడా పని పడితే దీన్ని కవిత్వమని వొప్పుకోఁడనియ్యేవే నాహృదయం. మీకు నాతత్త్వం (అజ్ఞత) తెలిసినట్లు మఱికొందఱికి తెలియదు. కనక వారు మీ "అమ్మా! మాదాకవళం" కవిత్వమే అంటూవుంటే కొందఱు తత్త్వం యెఱిఁగీనిన్నీ ప్రోత్సహిస్తూ వుంటే తెలిసినా తెలియకపోయినా జీవితమంతా దానికోసమే వ్యయించి “మ. కవనార్ధం బుదయించితిన్" అనుకొనే మాఁబోటిముసలాళ్లు హరీ అచ్యుతా అనకుండా వూరుకొనేయెడల ఆ తూష్ణీంభావంలో కొంతసుఖమే వున్నప్పంటికీ "అప్రతిషిద్ధ మనుమతం భవతి" గా పరిణమిస్తుందేమో నని తప్ప లేకపోతే విశ్వనాథ సత్యనారాయణకన్న వేయిరెట్లు నేను మిమ్మల్ని ప్రోత్సహించి, విని లోలోపల నవ్వేవారిలో లోపాయికారీని చేరి వుండేవాణ్ణే. అయితే అందుకు ప్రస్తుతవయస్సు ప్రోత్సాహకమని మీరే కాదు యెవరూ అనుకోరు. ఇట్లు ఆత్మవంచన లేనినన్ను మీరు శత్రువుగా భావించి యేమేమో వ్రాస్తున్నారు. భవతు. మొదట నేనే దీనికి వుపక్రమించినా తగినంత ఆవశ్యకత్వం లేకుండా వుపక్రమించలేదు. (యీ అంశంకూడా లోఁగడ సూచించే వున్నాను) దాన్ని మీరు తత్త్వదృష్టితో గ్రహింపక “అన్నా! మనకవిత్వం ఈయన కాదంటాడా?" అనే యీర్ష్యతో యేదోవిధంగా వాదం పెంచడంపేరే "కర్ణాట కలహం". నాకు తోఁచిన సలహా నే నందిచ్చాను. అయితే “నా౽పృష్టః కస్యచిద్ బ్రూయాత్" కనక మిమ్మెవ్వరడిగారని ప్రశ్నిస్తారా. వొక్క నన్నే కాదు. మీరు ఆ సభవారి నందఱినీ అడిగినట్టే ఆ సభలో సాహసించి దాన్ని చదవడం. కొందఱు లోలోపలనిరసించి ఊరుకున్నారు; పదిమందితో సంబంధం వుండడంవల్ల నేను పయికి నాభావాన్ని తెల్పివున్నాను. మీరు కోపం వచ్చి యేమన్నా అంగీకారమే? స్వస్తి.


★ ★ ★