పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

708

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


స్వార్థనిర్వహణార్థం చేసేపరిశ్రమ తుదకీలా పరిణమించింది. ఆపద్యంలో వున్న విషయం “జుగుప్పిత"మే అయినప్పంటికీ “కవిభావక భావ్యమాన” మయింది కనక దాని "రొట్టె నేతిలో పడిం” దనుకుంటాను. ఆదశరూపక శ్లోకంలో వున్నవిషయమే లోఁగడ నే నుదాహరించిన

“న స శబ్లో న త ద్వాచ్యం న సా విద్యా నసా కళా
 జాయతే యన్న కావ్యాంగ మహో భారో గురుః కవేః"

అన్నదానిలోనూ వుంది. భంగ్యంతరంగా మీదశరూపకశ్లోకంకూడా యేవిషయమేనా "కావ్యాంగం" అవుతుంది కాని, ప్రధానస్థానాన్ని ఆదుకోవడానికి పనికిరాదని బోధిస్తూ వుందని విస్పష్టమే. ముడిపదార్థాన్ని ముడిపదార్థంగానే ప్రదర్శించడం కవికృత్యం కాదు. వొకటి వుదాహరించి మఱీ నాకు తోఁచినమాటలు వ్రాస్తాను. చర్మాలున్నాయనుకోండి. రక్తమాంసవసామజ్జాదులతో నిండి హేయంగా వుంటే అందఱూ అసహ్యించుకుంటారు. వాట్లనే సంస్కరించిన పిమ్మటనో అనేకవిధాల గౌరవించి ధరిస్తారు. మీరు ప్రస్తుతం అట్టి సంస్కారం లేశమేనా "అమ్మా! మాదాకవళం తల్లీ" పల్లవిలోచేసి ప్రపంచకానికి అందించి వున్నారా? లేదు. ఆబిచ్చగాళ్లు యేలా వుచ్చరిస్తారో ఆలాగే వుంచారు. దీనిరచనవల్ల యేవిద్వాంసుఁడేనా కవిశబ్దభాక్కు కాఁగలిగితే వాళ్లున్నూ, “కవిశబ్ద భాక్కులే" కావలసివస్తుంది. కాని, వాళ్లు అలంకారగ్రంథాలు వ్యాసంగం చేసి పరీక్షలిచ్చి డిగ్రీ సంపాదీంచినవాళ్లు కాకపోవడంచేత “విద్వత్కవులు” మాత్రం కాలేరు. మీరు దశరూపకాన్నుంచి వుదాహరించిన శ్లోకం (రమ్యం జుగుప్సితం) యీలాటి అపభ్రంశ గేయాలకు కవితా పట్టాన్ని యివ్వడానికి పుట్టలేదు. ఆయీ రహస్యం "పాఠప్రతిష్ఠాజుట్టులకు" గోచరించేదికాదని నాహృదయం. ఇదియే ప్రధానాంశం. ఆగేయానికి లయపడుతుందా? పడదా? యిత్యాదులు ప్రధానాలు కావు. వీట్లనన్నిటినీ పెట్టుకుంటే ప్రధానం తేలదు. విశ్వనాథ సత్యనారాయణ నాఁటిసభలో దానికి లయ వేయలేదు. అతఁ డీవిషయం నాయెదట వప్పుకున్నదే. దాన్ని ఆనాఁడు మీరు చదివిన రీతిని దీర్ఘాలతో చదివితే దానికి యిప్పుడూ లయపడదు.

"గురువు లఘువు చేసి కుదియించి కుదియించి లఘువు గురువు చేసి లాగిలాగి." అనునట్లు పరిశ్రమచేస్తే లయపడని దంటూ వుంటుందా? మీరు శ్రవణసుఖార్థం కదా! దానికి వుదాత్తానుదాత్తప్రచయాదులు తోడు చేశారు. అథవా, లయపడడం ప్రస్తుతాన్ని సమర్ధించంగలుగుతుందా?