పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/591

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవితా విప్లవం - 2

695


వున్నారు. యెందు కంటారు. “ఏనిని” అన్నరూపం తిక్కన్నగారు కర్ణ, శల్య, సౌప్తిక, పర్వాలలో మూడుచోట్ల ప్రాసస్థానంలో ప్రయోగించి వున్నారు, కనక అది సాధువు అని తెల్పినందుకు. ఇంతమాత్రానికేనా? తిట్టడం, ఇంకా యేదేనా దోషం వుందేమో? అంటే వినండి. లోగడచూపిన (1) లవలేశములు (2) యజ్ఞ యాగములు వగయిరా సుప్రయోగాలు వాడినందుకుకూడాను. ఆ తిట్లు చూపుతాను. (1) చవట, (2) దుర్జాతి, (8) కయిగాడు, (4) పెద్దమ్మవారు, ఇత్యాదులు - ఇవన్నీ నాకు ఈ 72వ వత్సరంలో పరిషత్తువా రిచ్చిన బిరుదు లనుకున్నా అనుకోవచ్చును. వీట్ల విషయమై యేర్పడ్డ పరిషత్తు, యేదో, ఆపరిషత్తులో వుండే సభ్యులెవ్వరో తెలుసుకోవాలనే కోరికగలవారు "అరణ్యరోదనం" అనే గ్రంథంచూడవలసి వుంటుంది. మొట్టమొదటి మెంబరు 'ముళ్లకంచె'. కొంత వరకు అచేతన మెంబర్లతో కథసాగించి, తరవాత పంది, నక్క మొదలైన సచేతన మెంబర్లతో కథనడిచింది. చెడామడాతిట్టడం తప్ప యింక యేవిధమైన ఔచిత్యమూ నామట్టుకు కనపడలేదు, కాని - "రసజ్ఞత్వం” లేని కారణం చేతనే దాని తత్త్వస్ఫూర్తి నాకు కాలేదేమో అని యిప్పుడు తోస్తూవుంది. కర్మంచాలకదేన్ని గురించేనా - తప్పనో? ఒప్పనో? తెలిసినంతలో మనస్సు విప్పి చెప్పడంగాని, వ్రాయడంగాని తటస్థిస్తే, అది తనకు అనుకూలంగా కనపడితే చిక్కులేదు. ఆలాక్కాక, వ్యతిరేకంగా వుంటే వషట్కారాలు తప్పవు - ఇదంతా అనుభవానికి వచ్చియ్యేవే. "ఈనాఁడు, సత్కవియై పుట్టుటకూడ దోసమని వక్కాణింతు," అని వ్రాసుకున్నాను. ఎవరికో ఆగ్రహం వస్తుందని మనస్సుకు నచ్చని – “అమ్మా! మాదాకవళం" కవిత్వం నచ్చిందని యేలా వ్రాసేది? భారత సుప్రయోగాలు - “ఏనిని” వగయిరాలు అపప్రయోగాలంటే, యేలా వొప్పుకొనేది? కొందఱు తిట్టుదురుగాక, కొందఱు- “రసతత్త్వం నీకు తెలియదు” అని ధిక్కరింతురుగాక. అంగీకరించడమే యీవయస్సుకు తగ్గది. "అహమేవ, అహంచ, అహంస" అనే అవస్థాత్రయములో యీవయస్సు "అహం న పండితః" అనేదానికే తగినదికదా! 'వృద్ధులబుద్ధులు సంచలింపవే' అన్నారుకనక, యీ "అమ్మా మాదాకవళం" గేయంలో వున్న రసంనాకు గోచరించక పోవచ్చును. అందుచేత ఆవిధంగా వ్రాసియుందును. కొందఱు రసజ్ఞులు నచ్చినవారుంటే, వారి వారి చేవ్రాళ్లతో అభిప్రాయాలు సంపాదించి, పత్రికాముఖాన్ని ప్రకటిస్తే - "పరప్రత్యయనేయబుద్దులు" యథార్థాన్ని తెలుసుకుంటారు, “నలుగురితో నారాయణా, కులంతో గోవిందా" అన్నారు కనక, అప్పుడు నేనున్నూ వారితో యేకీభవిస్తాను అందాకామాత్రం - 'ఉ. కొందఱు సోదరీమణులు' అనేపద్యం ఆరసంలో యెంత ఆస్వాద్యమో యింకో రసంలో - "మాదాకవళం" గేయమున్నూ అంతే ఆస్వాద్యం. గేయమని పేరేగాని నాఁడు గేయకర్తగారు సభలో చదివినప్పుడు దీనికి లయకూడా పడినట్టు లేదు.