పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

694

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


జవాబేమిటి? ధాతుపాఠంలో వుందంటే తృప్తిపడకపోతే, నిఘంటు తృప్తిపరుస్తుందా? వుందే అనుకుందాం, అప్పుడు “అప్రయుక్త"మని వాదించవచ్చునుగా! మేమల్లా యీలాటి నిస్సారపువాదాలను లెక్కపెట్టకుండా శిష్టవ్యవహృతాలు కొన్నిటినీ, ధాతుపాఠాది వ్యవహృతాలు కొన్నిటినీ వాడుకుంటూ వచ్చాం. తెలుఁగులో “దులుపరించు" అనే ధాతువు శ-ర-నిఘంటులో లేదు దులుపుమాత్రమే వుంది. నేను యీ సంగతి యెఱిఁగే ‘దులుపరించు' అని వాడినాను. నీకాధార మేమిటంటే, వినండి, శ-ర-లో (1) చిలుకు - చిలుకరించు (2) పలుకు — పలుకరించు, యివి వుదాహరింపఁబడ్డాయి. ఉభయరూపాలకు అర్థంలో వైలక్షణ్యం మిక్కిలీ స్వల్పం. నేను 'దులుపు' అనేది మాత్రమే శ-ర-లో వుండినా - "దులుపరించు' లేకపోయినా వ్యవహారంలో వున్న హేతువుచేతనున్నూ గ్రామ్యమనడానికి అవకాశం లేకపోవడం చేతనున్నూ బుద్ధిపూర్వకంగానే వాడి వున్నాను. శ-ర-లో లేదన్నంత మాత్రంచేత వాడుకో కూడదనే పక్షంలో 'కళంకు' వగైరాలెన్నో గ్రంథస్థాలే దానిలో లేవు. ఇటీవలివారు కొత్తకోశాలలో చేరిస్తే, చేర్చి వున్నారేమో? చేర్చలేదే అనుకుందాం. అది వారిలోపం కావలసి వస్తుందిగాని, నిర్దుష్టమైన వ్యావహారికపదజాలం కాకపోతుందా? “పంచాంగంలో లేకపోతే, నక్షత్రాలు లేకపోతాయా?” దిజ్మాత్రం శబ్దజాలవిషయంలో మేము పెట్టుకొన్న మార్గం ఉదాహరించాను. కల్పనా విషయంలోనూ యితర విషయంలోనూ మే మేమి క్రొత్తపోకడలకు మార్గదర్శకులమైనామో నాకు స్ఫురించడంలేదు.

'యతించు' అనే సంవృతిరూపాన్ని వాడితే, అదికూడా తప్పనుకొనే విమర్శకులు కనపడ్డారు. 'యత్నించు' అనేదే సాధువనిన్నీ అది అనఁగా? 'యతించు' అనేది సాధువు కాదనిన్నీ ఆక్షేపకుల తాత్పర్యం. ఉపకృతిరూపమైన - 'యత్నించు' అనేది, సంవృతిరూపమైన 'యతించు' అనే దానికి బాధక మవుతుందని వ్యుత్పన్నులు యెవరూ అనుకోరు. యతీ ప్రయత్నే అనే ధాతువునుండే యీ రెండురూపాలు నిష్పన్నమవుతాయి. భవతు. ఆ యీ విషయం విశేషించి కాకపోయినా, యేకొంచెమో శాస్త్ర చర్చతో చేరింది. కనక యేదో విధంగా సమాధానం చెప్పడానికి యత్నిస్తే, యత్నించవచ్చు ననుకుందాం. ప్రస్తుతమైన “అమ్మా! మాదాకవళం' గేయంలో వుండే రసం నీకు తెలియదు అంటే, చెప్పే జవాబేమిటి? ఇది "సహృదయాః ప్రమాణమ్” అనే తరగతిలోదికదా! అందుచేత నాకు దానిరసం తెలిసిందికాదు, అని కిక్కురు మనకుండా వొప్పుకోవడమే యుక్తమని నాకు తోఁచింది. ఈగేయ కర్త నా విషయంలో యింతతోటే, అంటే! 'నీకు రసజ్ఞత్వంలేదు’ అనడం మాత్రంతోటే సరిపెట్టినందుకు అభినందిస్తూన్నాను. కొందఱు చెడామడా తిట్టినవారున్నూ