పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/587

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవితా విప్లవం - 2

691


పద్యంవల్లనూ వుంటుందని నే ననుకుంటాను. సహృదయైకశరణ్యంగా వుండే యీ విషయాలకు గ్రంథకర్తలు వివదించడంవల్ల ప్రయోజనం లేదు. లోకానికి వదిలివేయాలి. వ్యక్తిగతద్వేషాలుగాని, అభిమానాలుగాని, యీలాటి విషయాలలో అకించత్కరాలు. మొగమాటాలుకూడా డిటో, “మాదాకవళం” అనే గేయం యెవరిదో వారిపేరు వ్రాయకపోవడాని క్కారణం ఇది మా చిరంజీవి రచించినా, నేను ఏవగించుకొనే వాణ్ణి అని తెల్పడానికేకాని మఱోటికాదు. "యెంకిపాటలు" నేను ఆమోదించలేదని 20 యేళ్లక్రితం కృష్ణలో పడిన వాదోపవాదాలు తెలిపివుండడంవల్ల యిప్పుడు మళ్లా తెల్పవలసి వుండదు. గేయకర్త తగినంత ఉపపత్తి చూపకుండా వ్రాసిన మాటలు ఉపేక్ష్యాలే అయినా “రసతత్త్వం నాకు తెలియదు” అనే ఆయన వుద్దేశాన్ని అభినందించడానికి తప్ప యీ కాస్త వ్రాఁతాకూడా అనవసరమే. యీలాటి హేయవిషయాలు అంగంగా వుంటేతప్ప, అంగిగా వుండడం హృదయ రంజకంగా వుండదని నావ్యాసంలో నొక్కినొక్కి వ్రాశాను. ఆయీ శోచ్యగేయం నూతన గృహప్రవేశానికి కూడిన సభలో చదవడం నాకు మఱీ శోచ్యంగా కనపడింది. యెవరికి అట్లు తోఁచలేదో ఆసభాస్తారులు తెల్పితే శిరసావహిస్తాను. పెండ్లిసభకు వచ్చిన మేళం, లేదా, సొన్నాయి “తరలీ పోతాము చాలా దయలుంచండి, యిఁక మరలీ జన్మాలకు రాము మదిలో నెంచండి" అనే కీర్తన అభినయించడంగాని, పాడడంగాని అభినందనీయం కాదని తెల్ప నక్కఱలేదు. ఆయీ విషయంనాకేకాదు, మఱికొందఱికికూడా తట్టిందని గేయకర్తకుకూడా గోచరించినట్లు ఆయన వాక్యమే తెల్పుతూ వుంది. దాన్ని వుదాహరిస్తాను.

"శ్రీ శాస్త్రిగారికిన్నీ మఱికొందఱికిన్నీ రసస్ఫూర్తి కలగకపోవడం సత్యమే కావచ్చును.”

బస్, చాలును. యిఁక వాదం యెందుకు? యీ వొక్క మాటతోడనే యావత్తూ గతార్ధ మవుతూవున్నప్పుడు దీన్ని గూర్చి వివాదపడవలసి వుండదనుకుంటాను. కొందఱు “మాదాకవళం" మాదిరిగేయాలుగాని, పద్యాలుగాని ఆమోదించేవా రున్నట్లు నేనూ నా వ్యాసంలో విస్పష్టంగా సూచించే వున్నానైతిని. యింకెందుకు వాదోపవాదాలు? అయితే "వెం. శా. గారికి కవిత్వరసం అనుభవించడం బాగా తెలియదనే అంశం లోకానికి తెల్పడానిక్షి” అంటారా? అయితే సంతోషమే. పాశ్చాత్యులవెన్నకు అలవాటుపడితే, దీనికీ వెం. శా. అలవాటుపడుతాఁడు. యింతతో ఆఁపుచేదాం. యీ విషయం యింతతో ఆఁపి, పనిలో పనిగా వేఱొక విషయాన్ని గూర్చి కొంచెం వ్రాస్తాను. ప్రస్తుతం “మాదాకవళం" గేయాన్ని రచించిన యువకవిగారు, “ఆయీ మాదిరి కవిత్వానికి మార్గదర్శకుడు వెం. శా. శతావధానిగారే” అనికూడా కొంత సూచనచేశారు. ఈయన మాత్రమే కాదు,