పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/583

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భారత భారతి

587


కాకపోతే) గ్రంథకర్తకే గోచరిస్తాయి. యిది అట్టిది కాదు గనక, యేది? "అమర్చిన దానిలో అత్తగారు వేలెట్టింది” అన్నట్లు కవి పరంపర చెప్పకొనేదాన్నే ఆయీ “అమలిన తారకా" పద్యంలోని “ఎన్నను-ముట్టను-ఈదను" అనే తుమున్నంతాలను వ్యతిరేకార్థ కోత్తమ పురుషైక వచనాలుగా (వీలుండబట్టే సుమండి) సమన్వయించి చూపి బలపరిచాను. అయితే ఈయన యెవరో, పాపం! నాఁమీద కలియబడతారెందుకో? యెందుకా? పేరుకోసం అంటారనుకుంటాను. యింత మాత్రంతో పేరు వస్తుందా? అయ్యో? రాకేం. వెనక జరిగిన యితిహాసం కీ|| శే|| రాలు శ్రీ విక్టోరియారాణిగారికి సంబంధించింది. టుపాకీగుండు దాటిపోయింది. ఆకొట్టిన వ్యక్తిని పిల్చి “యిదేం పాపం జగన్మాత నీకేం అపకరించింది” అని అడిగితే ఆ మనిషి చెప్పాడుగదా "అయ్యా! నాకు వొక కోరిక వుంది. నా మనస్సులో లేశమూ దురుద్దేశంలేదు, చిత్తగించండి. ఆకోరిక పెద్ద పేరు సంపాదించాలనేది. దానికి యింతకన్న వుపాయంకనపడలేదు. యీ పాటికప్పుడే నా పేరు యెన్ని పత్రికలలోనో అచ్చవుతూ వుంటుంది. సప్తసముద్రాలూ దాటుతుంది." అని చెప్పేటప్పటికి చక్రవర్తిని ఆ మానిసి చెప్పినది యథార్థమే అయివుండునని నిశ్చయించి అతనికి యేవిధమైన శిక్షాలేకుండా విడుదల చేయించిందని చెప్పకోగా వినడం. యీయన యిప్పుడిప్పుడు వార్ధక్యంలో పైకివచ్చారుగాని, పేరుకోసం యత్నం చాలా కాలాన్నుంచి చేస్తూన్నట్టు వ్రాతమూలకాలు ఆధారాలున్నాయి. యీయన కేవో కొన్ని బిరుదాలు (నేతి బీఱ కాయలు) కూడా స్వగ్రామంలోనే (యింట గెల్చి రచ్చ గెలవమన్నారు. గదా!) అలంకరించారు. యిక నేం కావాలి? “తిక్కన సోమయాజిగారు” భారతాన్ని పూర్తిచేస్తే యీయన వ్యాకరించడానికి ఆరంభించారు. తెలుగుగదా అనుకున్నారు కాబోలును! అలా అనుకుంటే విరాట పర్వం దగ్గిఱ నుంచి పని జరుగుతుందేమో? లేదా? అరణ్యపర్వంలో వున్న-

“చ. స్ఫురదరుణాంశు రాగరుచి బొంపిరి వోయి... ..."

అని పద్యం దగ్గిఱనుంచి కూడా పని జరుగుతుందేమో కాని,

“ఉ. శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారక హారపంక్తులన్
     జారుతరంబులయ్యె వికసన్నవ కైరవగంధబంధురో
     దారసమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
     ర్పూరపరాగపాండు రుచి పూరము లంబరపూరితంబులై"

యీ వొళ్లేఱుగని శివపు ధోరణి కవిత్వాన్ని వ్యాకరించడానికి చాలా సామగ్రి వండాలి. ఆ యీ పద్యంగాని, యింకా కొన్ని పద్యాలు ఆదిపర్వంలోనే "మాకు బ్రసన్నులయ్యెడున్”