పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/574

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

578

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సంతోషమే సరే? యీలాటి ప్రశ్నలువేయండి తప్పేమి. తోఁచినంతలో జవాబు వ్రాస్తాను. శిష్ట్లావారి అభినందనంవల్ల మీరు మళ్లా వ్రాఁతకి దిగారుగాని లేకపోతే దిగేవారుకారు. వారు పూర్తిగ పొరఁబడ్డారు. మీతిట్లువగైరాలకు మీ కెంత జవాబు కాధారం వుందో? వారి అభినందనానికి అంతే. యీ సంగతి మీకుత్వరలోనే గోచరిస్తుంది. నేఁడో రేపో శిష్ట్లావారు నా “నన్నయభట్టు" వ్యాసాన్ని చదివితీరతారు. ఆధారం దొరికితే నన్ను మందలిస్తూ జవాబు యిస్తారు. దొరక్కపోతే ప్రమాదపడ్డట్టేనా జవాబు యిస్తారు. (“ప్రమాదోధీమతామపి” అపి రేవ కారార్ధకః అంత అసిధారావ్రతంగా నడిచే జీవితం యెక్కడో కాని వుండదు.) నిమ్మకు నీరెత్తినట్లు గంభీరంగా వూరుకోనేనా వూరుకుంటారు. "అప్రతిషిద్ధ మనుమతం భవతి." కనుక అట్టి తూష్ణీంభావం కూడా వుపయోగమే అవుతుంది. నేను వికటవిమర్శనంచేస్తాను. చూస్తారా? అంటూ వకవాక్యం నన్నయ్య వ్యాసంలో వ్రాస్తేదాన్ని ఆక్షేపించడం మొదలెట్టి వున్నారు విమర్శకులు. కర్ణుడు పలికిన పల్కులు వున్నపద్యం చూపి వున్నారు. నన్నయ్యభట్టు భావివిషయం సూచితమైన“భారతభారతీసముద్రము” అన్నదాన్నిగూర్చిన నావివరణం బాగులేదంటూ వ్రాఁతకు దిగారు. యెందుకు తండ్రి? యీ అప్రస్తుతాలు. ప్రస్తుతం మీతిట్లను సమర్ధించుకొని బయటఁబడే ప్రయత్నం చేయండి. తరువాత నన్నయ్యభట్టునీ, తిక్కన్న సోమయాజినీ యెఱ్ఱాప్రగడనీ వుద్ధరిస్తురుగాని- "స్వయం తరితు మక్షమః కథ మసౌ పరాం స్తారయేత్" భారతానిది యేవూరు; మీదేవూరు? భాగవత పీఠికలోవున్న- “ఒనర న్నన్నయ తిక్కనాదికవులు” అన్నపద్యార్థం అవగతం కాకో లేదా? చూడకో? యెంతోగతంలో వ్రాయడమేకాక మళ్లా యీవ్యాసములోకూడా బోలెఁడువ్రాఁత వ్రాసినమీరు భారతంలో వుండే సంశయాలు తీరుస్తారేమి? పైఁగా అందులో వుండే పద్యార్థాలు నేను అన్యథా చెప్పినట్లు మీకు యెవరో చెప్పినట్లుగా అభూతకల్పన వొకటా? కాదు నిజమే అనుకుందాం. “నహిసర్వ స్సర్వం విజానాతి" కదా? యేదోపద్యం నాకంటె మీరే బాగా అన్వయిస్తారనుకోండి. తగినవయస్సుకాక పోఁబట్టిగాని యుక్తమైన వయస్సే అయితే నావద్ద తమరు యెంతకాలం శుశ్రూష చేయఁదగ్గ పాటి సాహితి కల్గి వుంటారో? (యితరులను వద్దు) మీ అంతరాత్మను ప్రశ్నించి చూడండి. అది యేదో యంత్రం వుత్తర దిక్కునే సూచించినట్టు యథార్థాన్నే బోధిస్తూ వుంటుందని యింతగా మనవి చేయడం. స్థూల దృష్టిని 76 యేండ్ల వయస్సుగదా? వొకరివద్ద శుశ్రూష చేయడానికి తగినది కాదని వ్రాశాను గాని బాగా ఆలోచిస్తే 'ముదిమి రెండవ బాల్యంబు' అన్నారు కనుక తగినదే అవుతుందేమో? శాంతం పాపం? యెంతో గర్వరహితంగానే వ్యాసాన్ని నడిపిద్దామని సంకల్పించానుగాని, బూతు కూఁతలు పడలేదుగాని గర్వోక్తులు (యథార్థాలే అనుకోండి)