పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/573

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

577


గుప్తార్ధప్రకాశిక 266, 267, 268 పేజీలు చూడండి. 268లో సుమారు 12 పంక్తులు దాఁటిన (ఓహో! దాఁటి ప్రయోగంపడిందే మళ్లా తప్పు పడతారనుకుంటాను.) తరవాత శ్రద్ధగా చదివితిరా మీదుమాదు ప్రయోగాలలో వుండే సాధుత్వం తెలుస్తుంది. యెవరో లాకలూకాయలు ప్రయోగించిన ప్రయోగాలుగావు. కానేకావు. గ్రంథకర్త చూపిస్తా: అప్పకవీయంలోవి. తెలిసిందా? జాగ్రత్త సూత్రార్థం కూడా యేకవచనానికే దుగాగమం వస్తుందనిన్నీ బహువచనానికి రాదనిన్నీ చేసుకోరాదని చేసుకోవడానికీ అవకాశం లేదనికూడా సహేతుకంగా ఆయన గట్టిగా మందలించారు. మీకు సూత్రార్థాలూ గీత్రార్థాలు (తెలియవు కనుక) వుపయోగించవు కదా? ప్రయోగాలు చూచుకోండి. సంతుష్టిపడండి. మెసలడానికి అవకాశం వుంటేమీరు వూరుకొనే వారుకారు కనక మెసలనే మెసులుతారు గదా? లేనిపద్ధతినో? యేమీలేదు. మళ్లా తిట్లకేరేఁగండి. యీలా అభ్యనుజ్ఞ యిచ్చినప్పటికి యిటుపైనిమీరు రేఁగుతారని తోఁచదు తిట్లకు. యేమంటారా? యింక ఆబాపతు సరుకు ఈవద్దస్టాకులో లేనట్టు పూర్తిగా ఘాటుచచ్చినమాదిరిగా లంఖణాలబోటు వాలకంగా నడచిన యిప్పటిమీ - "సంశయవిచ్చేద" వ్యాసంవల్ల గోచరిస్తూవుంది. యీ వివేకం మొదటేకల్గితే మీవయో వృద్ధత్వానికి యింత హానికలిగేదికాదు. అయితే యెవడిశక్యం. దైవం అనుల్లంఘనీయంకదా? సరే యీవ్యాసంలో మీరు జవాబురాలేదనుకొన్న-నగ - ఎసఁగు, ప్రాసల శంకకున్నూ “మీదుమాదు" దుగాగమ శంకకున్నూ జవాబు వచ్చినట్లేనా? యిఁక “దుప్ప్రాసాలు" అన్నదానికి బాకీవుంది. "నీళ్లల్లో గేదె (బఱ్ఱె)ను బెట్టి బేరంబెడితే యేలాగ?" ఆదుష్ప్రాసాలు వున్నచోట్లేవో ? చూపి ప్రశ్నించండి, సమాధానం చెప్పఁగలిగితే చెపుతాను. లేదా? తప్పే అని వొప్పుకుంటాను. లేదా? ప్రమాదం అంటాను. అయితే విమర్శన గ్రంథంలో చూపేవున్నాను. చూచుకో అంటారేమో? ఆపుస్తకం ప్రస్తుతం నావద్దలేదు, మా తిరుపతిశాస్త్రి కొడుకు వద్ద విశాఖ పట్టణంలో వుంది. వాఁడి అడ్రెసు నాకు బాగా తెలియదు. అందుచేత ఆపుస్తకాన్ని వకటి పంపండని మిమ్ములనే ప్రార్ధించవలసి వచ్చింది. అనుగ్రహించండి. నన్నయ్య వ్యాసంతో తమరు విరమిస్తారనుకొని వాఁడు చూస్తానంటే వాఁడికి యిచ్చివున్నాను తెలిసిందా? అయితే- “తానొకటి తలిస్తే దైవము వొకటి తల్చాఁడు" ఆవ్యాసమూ మిమ్మల్ని మందలించలేకపోయింది. సేల్జోడుబహుమానమూ మీవిజృంభణాన్ని మందలించలేకపోయింది. కొంచెంగా ఘాటుమాత్రం తగ్గించాయి అవి. యెందుచేత? నేను కవితాధార సాఫుగావుందని సేల్జోడు బహుమానం యివ్వదలఁచినా మీరు అందు కనుకోలేదు. తిట్ల పాండిత్యానికిరా? బాబూ! యీ సేల్జోడు అనుకొని వుంటారు. సామాన్యులా? ఆవలిస్తే పేగులు లెక్కెడతారుగా? అదిన్నీకాక దానికి వుపమానంగా చూపినకథవల్ల అసారస్యం యేలాటి పసిపిల్లాఁడికేనా గోచరిస్తుందాయె బాగా గ్రహించారు.