పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/561

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

565

యీ విమర్శకుఁడుగారు సంశయ విచ్ఛేదము అనే శీర్షికతో యింకా యేవేవో ప్రగల్భాలు వ్రాసి యీనాలుగు మాటలున్నూ బలవంతంగా వ్రాయించుకున్నారు. గాని యిది బుద్ధిపూర్వకపు వ్రాఁతకాదు. ఆలాటి వ్రాఁతే అయితే యింతఘాటు తగ్గివుండదని లోకమెఱింగినదే? (వెం. శా. కి కలిగిన సంశయ మేమిటో వీరు తీర్చేదేమిటో? ఆవ్యాసానికీ శీర్షికకూ వుండుకున్న “బదరీబాదరాయణ" సంబంధం తప్ప యితర సంబంధం యెట్టిదోతేల్చాలి) యిందుకు కారణం యింకోటి కూడావుంది. మొదట యీ గుంటూరు కలహం తెచ్చిపెట్టింది రాహుమహాదశలో శుక్రుఁడు యిప్పటికి మళ్లా శత్రుస్థానంలోవున్న శనిలో శుక్రుని అంతర్దశ వచ్చింది. వచ్చి యిప్పటికి ఆఱు మాసాలు కాబోలును అయింది ఆకారణంచేతే, “ఆలర్కం విషమివ" అని భవభూతి చెప్పినప్రకారం చిరకాలానికి యిది మళ్లా రేగింది. యీలాటి తార్మాణంవల్లనే నేను జాతకాన్ని నమ్మేపిచ్చి వాళ్లల్లో వొకణ్ణిగా లోకంచేత పరిగణింపఁ బడతాను. ఆలర్కం, వెఱ్ఱికుక్క సంబంధమైన విషమని వ్యాఖ్యాత వ్రాసినట్లు జ్ఞాపకం. అది సకాలంలో నివర్తించక యేమాత్రం శేషించినా యెప్పుడో వకప్పుడు మళ్లా పొడచూపి బాధిస్తుందని సంప్రదాయజ్ఞులు అంటారు. ఆలాగే యిదిన్నీ అప్పుడు వీరు 46 యేండ్లవయస్సులో వున్న ప్రాజ్ఞులైవుండికూడా “నలుగురితోపాటు నారాయణా, కులం తోటిపాటు గోవిందా"గా నాఁడు మమ్మల్ని ప్రత్యేకించి దర్బారు అనే పేరుతో వక పత్రిక పెట్టి దూషించే మహానుభావులతో నేకీభవించి యేవోనాలుగురాళ్లు రువ్వితే, మళ్లాయిప్పుడు నాకు యీ పరిశ్రమ కలిగించ వలసి వచ్చేదే కాదు.

“సఱ్ఱాజు పెళ్లిలో గుఱ్ఱాజు కొకపోఁచ"గా అప్పుడే యేదో అయేది “గోళ్లని తీరేపనికి గొడ్డళ్లన్నట్లు మళ్లా యీపరిశ్రమ తగిలేదేకాదు. కాని యీశనిలో వచ్చే శుక్రాంతర్దశకు దీన్ని వీరు మిగల్చడం అంటే? “న దుఃఖం పంచభి స్సహ" అన్నట్లు వారితో చేరక మీకు తిట్టడం బాగా చేతగాదు. అందుచేత నేను మీతో కలవను అని మాని స్వయంపాకస్థుల మాదిరిని శుద్ధశ్రోత్రియంగా పృథక్కుగాతిట్టడం అనేది దైవచోదితంగాని, యెన్నివిధాల ఆలోచించినా బాహ్యకారణంగాని, అంతఃకారణంగాని కనుపించడంలేదు. అందుచేత యీదోషాన్ని సర్వమున్నూ నాజాతక గ్రహాలమీద "పాపాయపరపీడనం"గా ఆరోపిస్తూ విమర్శకుఁడుగారి స్నేహాన్ని లోగడ మాటిమాటికి అభ్యర్థించడం జరగనే జరిగింది. కనకదాన్నే జ్ఞాపకంచేస్తూ, నన్ను రప్పించ దలచినది త్రికరణశుద్ధిగానే జరిగినట్టిదే అయితే నా యిప్పటిస్థితి ఆలసింప తగ్గది కాదు కనుక- “శుభస్య శీఘ్రమ్” అనే లోకోక్తికి ఉదాహరణంగా వుండేట్టు చేయవలసిందని ప్రార్థిస్తూ స్వస్తి చెపుతూన్నాను. వెం. శా. శతావధాని.