పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/560

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

564

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వాచ్యంగానున్ను కొంత వ్యంగ్యంగానున్నూ వుంటుంది. గనక చదువరులు బాగా గమనించాలి. వారుసమాధానపడక పోవచ్చును. గాని నేను వారికొఱకు మాత్రమే వ్రాయలేదుకదా? నన్నయ్యను పురాణాలు తెలిగించిన కవులలో చేర్చినదికదా? నాప్రధానాపరాధం; పోతన్నగారి ప్రవృత్తివల్ల విమర్శకుఁడుగారికి యథార్థం బోధపడి వుంటుందా? యింకా బోధపడదా? యిందుకేనా వారు సంతుష్టిపడితే వారికి వచ్చిన ఆగ్రహంలో నూఱువంతుల్లో 99 వంతులు సవరణ అవుతుంది. మా పెద్దలు కృతార్థులవుతారు. గుంటూరుసీమ అంతా తప్పులతడకే అయినా ముప్పై సంవత్సరాలు నిరాఘాటంగా ప్రచారం చేసి రెండు ముద్రణాలు పొంది సుమారు నాల్గువేల రూపాయలు సంపాదించుకుంది. యీ పైనిదాని ప్రచారం ఆగిపోయినా చిక్కులేదు. యెంతోకష్టించి వ్రాసిన విమర్శకుడుగారి ప్రయాసకు ఆమాత్రమేనా చారితార్థ్యం కలిగించడానికి నాఅభ్యంతరం లేశంకూడా లేదుగాని ఆచరిత్రను ఆమూలాగ్రంగా యెఱిగిన విమర్శకుఁడుగారి బంధువులే యెదురుకుంటారేమో కదా? ఆలా యెదురుకోవద్దనిన్నీ వారు చాలా పరిశ్రమ చేసి వ్రాసివున్నారనిన్నీ యీతుట్టతుది వయస్సులో నేను యెవరినీ జయించే కోరికతో లేననిన్నీ వొకవేళ "పుఱ్ఱెను పుట్టిన గుణం" సామెతగా అట్టికోరిక నాకింకా పోకపోయినా “పిచ్చుక మీద బ్రహ్మాస్త్ర ప్రయోగానికి" సిద్ధపడేది లేదనిన్నీ కాబట్టి నాకోరిక చెల్లించవలసిందనిన్నీ వారిని ప్రార్థిస్తాను. ఆపద్ధతిని నీవీమాత్రం వ్రాయడం కూడా అవసరమే అని శంకిస్తారేమో? వినండి నేను విరమించుకొనే తలపుతో సమ్మానానికి అంతఃకరణశుద్ధిగా ఆహ్వానిస్తే దాన్ని వారు అన్యథాకరించి,

“మ. గతమేమో? గతియించెఁ గొంతఅదియున్ గయ్యాలతో గొంత శాం
      తతతోఁ గొంత వృథాగఁ గొంత కవితానందమ్ముతోఁ గొంత యే
      యితి కర్తవ్యము లేక కొంత యెటులో యీపై భవచ్చింతనా
      మృతరక్తిం గలిగించి ప్రోవుమని కే లే మోడ్తుఁ గామేశ్వరీ”

అని యిలువేల్పు కామేశ్వరిని ప్రార్థించుకుంటూ సర్వసంగపరిత్యాగినిగా వున్ననన్ను-

“తే, కొట్టవచ్చిన వారిని గొట్టఁ బోక
     తిట్టవచ్చినవారిని దిట్టఁబోక
     చతురుపాయమ్ములను శాంతి సతతమార్జి
     తమ్ముగావలెనంచుc జిత్తమునఁ దలఁతు."

అని జీవితచరిత్రలో వ్రాసికొని తదర్థమై అవసరంలేని సందర్భంలో కూడా క్షమాపణయిచ్చి లోకానికి దాన్ని వెల్లడించి వున్ననన్ను-