పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

558

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అంగీకరించి సిద్ధపడినా? యీటిక్కెట్టు చార్టీకంటె యెక్కువే అడుగుతారో? యింకా అంతకంటేనూకూడా సమయాన్నిపట్టి మఱిన్నీ యెక్కువబిల్లు చేస్తారో? అందుచేత మనం ముందే జాగ్రత్తపడడం మంచిదికదా? (“జాగ్రత్తా తోభయం నాస్తి") యిక్కడికి మూడు టిక్కెట్లన్నఱతేలింది. నాకు దూరప్రయాణానికయితే సెకండు క్లాసుగాని దగ్గిఱప్రయాణమే కనక యింటరు చాలును. నావ్యాధి ఆవలీవలికి తఱచుగా వెళ్లేపద్ధతిలోది కావడంచేతగాని ఆచిక్కేలేకుంటే? యింటరులోకాకపోతే గౌరవానికి లోపం వస్తుందని నేనెన్నఁడు అనుకోను. యేంచేసేది. “అవస్థాపూజ్యతే రామ" అని యెవరెఱుఁగరు? యిక్కడికి రమారమీ అయిదు "థర్డుక్లాసు" టికెట్లదాఁకా డేఁకినట్లయింది. యింకా కొన్ని సాదరఖర్చులు గుఱ్ఱపు జట్కాలు వగైరాల బాపతు వుంటాయికదా? నేను రోజువారీగా పుచ్చుకొనే మందులు నేనే తెచ్చుకుంటాను. నల్లమందుసహితంగా, వకప్పుడు అవసరం పడితే ఆమందులు సమీపంలో వుండేపట్నానికి యెవరేనా వెళ్లి తీసుకురావలసి వస్తుంది. (దీనికి నేనే సొమ్ముయిస్తాను.) చాలా రోజులు వుండవలసివస్తే తప్ప మూడునాల్గురోజులయితే యిూ మందుల సప్లయిచిక్కువుండదు. యేమో? వెళ్లేది పొరుగూరుగదా? యెన్నఁడూ వెళ్లలేదు కూడాను. యెన్నాళ్లు పడుతుందో? యిప్పుడు ఆగ్రహంగావున్న విమర్శకుడిగారికే నామీఁద అనుగ్రహం కలగగూడదా? లేదా ఆవూళ్లో చాలామంది సంపన్న గృహస్థులున్నారని వినికి వారికి నామీఁద అభిమానం కలిగి మఱి కొన్నాళ్లుండవలసివస్తే వస్తుందేమో? అభిమానానికి కారణం లేకపోలేదు. వారివూరి విమర్శకులు నన్ను యెన్ని తిట్టినా, వాట్లను నేను సహనంతో వెఱ్ఱివెంకటాయ మాదిరిగా దులపరించుకొని శిరసావహించి వారియందుండే యేదోగుణాన్ని పురస్కరించుకొని-

“పరగుణపరమాణూన్ పర్వతీకృత్య"

అనే భర్తృహరి వాక్యానుసారం గౌరవించడానికి ఆహ్వానించడం కంటె వేఱొకకారణం యేంకావాలి. రెండోది వారివూరి విమర్శకులు నన్ను సమ్మానించడానికి ఆహ్వానించినప్పుడు వారు సామాన్యగృహస్థులవడంచేత వారికి మనంకూడా తోడ్పడదామనే వుద్దేశం వారికి కలిగినా కలగవచ్చు. దీన్ని యిప్పుడు నిర్ణయించలేము. నాకు నాజీవితకాలంలో జరిగినవన్నీ యీలాటి సందర్భంలో జరిగిన సమ్మానాలే. వాట్లని వివరించవలసివస్తే చాలా పెరుగుతుంది. కనక వుపేక్షిస్తాను. అందుచేత యీధూళిపూడి ప్రయాణంకూడా తుదకు అలాగే పరిణమిస్తుందేమో అని అనుమానించవలసి వచ్చింది. యిది పుత్రేక్ష కాదు. ఆమధ్య శ్రీరావుగంగాధరరామారావుబహద్దరుగారి షష్టిపూర్తికి మద్రాసు వెళ్లి యెవరికీ తెలియకుండానే వద్దామని సంకల్పించుకుంటే తుదకు అది ఆలా కాలేదు. శ్రీరాజావారి