పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/538

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

542

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


లోకోపకారార్ధం సంశయవిచ్ఛేదం చేయడానికి భారతం (అదేనా తెలుఁగే సుమండీ) మాత్రమే చదివివుంటా రనుకోవాలో? తెలియదు. యేమంటారా? “మ. ఒనరన్ నన్నయ తిక్కనాదికవులీయుర్విం బురాణావళుల్ దెనుఁగుం జేసియు” అన్న పద్యంలో పోతన్న గారుచేసిన అపరాధాన్నేనా తి. వెం. కవులు. “క. ఎన్ని పురాణమ్ములు" అనేపద్యంలో చేసింది. అంతకన్న అధికమైనదా? అట్టిస్థితిలో దీన్ని వీరే (తి. వెం.) చేసిన అపరాధంగా అపవదిస్తూ-

1. కవితాలలనమొగంబు బూడిదం బులిమెదవే

2. బ్రాహ్మణుండవ యింత దుర్మార్గమగునె?

3. మామీఁదికరుణ (నన్నయ్య) చచ్చెనటన్నన్

4. దురభిమానంబు నీలోన దొరలికాక.

యిన్ని అసంగతోక్తులున్నూ, సాహసోక్తులున్నూ వ్రాయవలసి వుంటుందా?

పోతన్నగారు నన్నయ్యను పురాణముమాత్రమే తెలిఁగించిన కవులలో మాత్రమే కాదు, పురాణావళుల్ తెలిఁగించిన కవులలో కూడా చేర్చి గౌరవించి వుండఁగా మేము గౌరవించఁ గూడదా? దానికి యీవిమర్శకుఁడు గారి అభ్యంతరమా? మాకు యిక్కడికి విమర్శకుఁడుగారి ప్రశ్న సౌడభ్యం వెల్లడిగా తెలుస్తూవుందా? సౌడభ్యం (లడయో రభేదః) యీలావున్నా తిట్లేమో-1. క్రొత్తవిశ్వస్తలన మూలఁగూరుచుండి, 2. అరయఁ బదియవనాఁటి ముత్తైదువలన, 3. యిద్దఱుభోక్తల కెక్కడెతద్దినము, 4. చచ్చిచెడంగలారు, 5. పదయవనాటియైదువలభంగి నడంగరే?

యీలాటి అమంగళాలతో వున్నా నిరసనోక్తులేమొ? 1. వెఱ్ఱివెంకటాయ, 2. మన వెంకటశాస్త్రి నీతిమాలిన వ్రాతల్, 3. ధీరహితా (బుద్ధిహీనుఁడా), 4. నీవె కవివె?, సింగిగూడఁ గవిత్వంబు చెప్పలేదె? 5. బుద్ధిలేదె? 6. నక్కపోతునని యుపమించుకొమ్ము.

యింతటి అనాత్మజ్ఞత్వంలో వున్నా, యివిలేశమున్నూ నేను గణించనే లేదని ఈయన్ని త్రికరణశుద్ధిగా నేను సేల్జోడు (రమారమి 70 రూపాయిలది) సమ్మానించడానికి ఆహ్వానించినదానివల్లనే లోకం గుఱితిస్తుంది కదా? నేను ఈతిట్లవల్ల అమాత్య సార్వభౌమ వంశోద్భవులే అయినా బొత్తిగా బొందcబడుతూ వున్నారుగదా? అని మనస్సారా గుఱితించి “బుద్ధిః కర్మానుసారిణీ" అని సమాధానం చెప్పికొని యిట్టి అనాత్మజ్ఞులతో ఆసన్న మరణదశాంతర్దశలలో వున్నమనం వాదోపవాదాలకి దిగడానికి ప్రాజ్ఞలోకం బొత్తిగా అంగీకరించదని యింట్లోవున్న పదార్థంగాని మనం కొని చేసేది కాదుగదా? అని,