పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/536

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

540

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


శిష్ట్లావారి అభినందన సందర్భములో స్వాగతంలో వున్న విమర్శకుడుగారి "కత్తిఝళిపించు"ను గూర్చిన ప్రసంగములోన్నుంచి యిలా ఎక్కడికో పోతూవున్నాము "కత్తిఝళిపించు" వ్రాఁత చాలా సరసంగావుంది. యేమంటారా? వ్రాసినవారు యిట్టే తప్పుకోవచ్చు, హిట్లరు మహాశూరుఁడు కదా? అతఁడిమీద మాయింట్లో నేను కూర్చుండి బ్రిటిషు తరఫున నావద్దవున్న (బండాడిముక్కుకూడా తెగని) మొద్దుచాకు నూరి ఝళిపించవచ్చునుగదా? అది పనిచేసిందా? లేదా? అన్నది విచారణాంతరం. శ్రీకృష్ణభగవానుడేమన్నాడు--

"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన"

అనలేదా? ఫలం దైవాయత్తం. మనం చేయవలసింది పనిమాత్రమే. అట్టిపనిని విమర్శకుఁడుగారు చేసినారు కనుక వారు మహాసాహసులని మాత్రమే ఆవాక్యం చెపుతుంది. ధ్వనినికూడా తీస్తే విమర్శకుని శక్తి తి. వెం. కవులముందు అంతగాని, కొంతగాని పసకట్టేది కాదుగాని కాకపోయినా సాహసించి అందుకు పూనుకోవడం అభినందనీయమని కూడా తేలుతుంది. ధ్వనిగదా? “అస్తమేతి గభస్తిమాన్” అనేవాక్యం యెందఱికెన్ని విధాల ధ్వనించింది. కాని ఆధ్వనికికూడా కొంచెం సంబంధం మాత్రం వుండాలి. యీమాట విమర్శకుఁడుగారు బాగా గమనించాలి. ఇది విషయాంతరం. శిష్ట్లావారు స్థూలదృష్టిని అభినందించడంలో ఆమాట దొర్లినట్టు అనుకోవడమే. యిప్పటికి నాకు కర్తవ్యం యేదేనా యింతకంటె అధికం వారు తెల్పితే తెలుసుకోవడమున్నూ - పెళ్లి పీఁటలమీఁద వున్న పెండ్లికొడుకును వారివారికి తోఁచినట్టు అందఱూ ఆశీర్వదిస్తారు. వాటికి అవయవార్థాలలో అవసరం వుండదు. ప్రస్తుతం సందర్భం ఆలాంటిదైనా ప్రసక్తి కలిగి కొంతవ్రాయవలసి వచ్చింది. యెందులోన్నుంచి యెందులోకో పోవడంవల్ల ప్రధానాంశం మఱుగుపడుతుంది, మామీసాల ప్రసక్తిలో విమర్శకులు వేసిన ప్రశ్న ఆయనకు బొత్తిగా దానిపూర్వోత్తర సందర్భాలు తెలియకవేసిన ప్రశ్నగా ఋజువు చేయబడిందికదా? యీలాటిప్రశ్నలే గుంటూరుసీమలోని (ఆప్రాంతంవారు ఆబాలగోపాలమూ యెఱిఁగిన) సందర్భాలను గూర్చి కొన్ని వేసివున్నారు. స్వర్గతులుకాగా మిగిలిన విమర్శకుఁడుగారి బంధువులకే వాట్లవిషయం బరాతంపెట్టి వున్నాను.

వారు యీపాటికి విమర్శకుఁడుగారికి వాటిసందర్భాలు చెప్పేవుంటారనుకొంటాను. కాని యీవిషయంలో యింకోటి ప్రస్తుతం ఆలోచించాలి. సుమారు ముప్పదియేళ్లనాఁటి గుంటూరు సీమచరిత్ర యిప్పుడు 76 వత్సరాల ప్రాయంలో వుండడం నిజమే. అయితే అప్పటికి 46 వత్సరాల ప్రాయంలో వుండే వీరికి యితరులు బోధించడంతో పనేముంటుంది.