పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/535

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

539


వాక్యాన్ని - "ముద్దు గుడవరా ముది పెండ్లికొడకా" అన్న సామెతగా ప్రాసకుదిరింది కదా? అని తద్దినంగా అపవదించి అమంగళాశ్లీలాలు వెలార్చిన మాకృతి కన్యాప్రదాతలుం గారు యింకా ఆ వాసనసోకే అనుకుంటాను యీ ఆబ్దికపు పిండివంట (గార్లు) నాకు అనుగ్రహించి వుంటారని వూహిస్తాను. నాకు యిప్పటి పెండ్లి (కృతికన్యాపరిణయం) మూఁడోదో? నాలుగోదో? అవుతుంది. తక్కిన భార్యలు తిట్టుమోతులుగారుగాని, యీనాల్గో భార్య బాగా గయ్యాళిన్నీ తిట్టుమోతున్నూ దొరికింది. వార్ధక్యం దీనితో గడపాలి. శాంతం పాపం! మొట్టమొదటి పెళ్లికి పిల్లనిచ్చిన అత్తవారింట కూడా అదేంకర్మమో? నాకు మా అత్తగారు (మీరు నమ్ముతారో, నమ్మరో?) గార్ల పిండివంటతోనే విందు చేసేవారు. అది మీకు ఇప్పటికి యేలాజ్ఞాపకం వుందంటారేమో? నాధారణయెఱింగినవారున్నూ ఆ మధ్య నేను వ్రాసిన దీర్ఘవ్యాసాలు చదివినవారున్నూ యీప్రశ్న వేయరు. నాకు మూఁడో సంవత్సరములో నా తరువాత పుట్టి - మొన్న పురుట్లో వోయిన “ప్రబుద్దుడు" అనే పద్యార్థానికి లక్ష్యమైన మాతమ్ముడు పురుడు సహా యిప్పటికింకా తూ.చా.తప్పకుండా జ్ఞాపకం. అతిశయోక్తిగా జమకట్టుకుంటే ఆలాగే జమకట్టుకోండి. నమ్మితే నమ్మండి - “నమ్మిన నమ్మకున్న నది నావశమా" అన్నారు. మా పరమమిత్రులు శ్రీదాసు శ్రీరామ మహాకవిగారు యేదో విషయం వ్రాస్తూ తెలుఁగు నాఁడు అనే చిన్నపుస్తకంలో, యిది విషయాంతరం, ప్రస్తుత విషయం జ్ఞాపకం వుందనడానికి బీజమేమిటంటే? అప్పటికి ఏడెనిమిదేళ్లవాఁడు నాకొకస్యాలకుడుండేవాడు. ఆకుఱ్ఱవాడు ఆ గార్ల పిండివంట సందర్భములో అన్నాడుకదా? మా అత్తగారితో- "అమ్మా! యీవాళ మనింట్లో గార్లు వండుతున్నావు తద్దినమా?" అన్నాఁడు. అది మా మామగారువిని వాణ్ణితిట్టి అయ్యో అమంగళంగా అన్నాఁడే అని నొచ్చుకున్నారు. ఆయన కుఱ్ఱవాణ్ణి తిట్టిన తిట్లు కూడా జ్ఞాపకం వున్నాయికాని, యెలక మీఁదా, పిల్లిమీఁదా పెట్టి నేను విమర్శకుడు గారిని తిట్టినట్టువారు భావించుకుంటారని వుటంకించలేదు. క్రియమాట యీవృద్ధదశలో తటస్థించిన అత్తవారివిందులోనే కాక బాల్యదశలోకూడా నాకు అత్తవారివిందు "గార్ల" తోనే జరిగేదన్నది యిక్కడ వక్తవ్యాంశం. మా అత్తమామలు నన్నుయెప్పుడూ గారు పదంతోటే పిల్చేవారన్నది ధ్వన్యర్థం. యీ మామగారు యేకవచనంతోటే గౌరవించారు పూర్వం. యింతకూ చెప్పేదేమిటంటే? యిప్పుడు వ్రాసూవున్న వ్యాసంలో మాత్రం దుందుడుకు మాటలు కొంత మృగ్యం అనియ్యేవే, సాహసోక్తులు, తలకు తగని ప్రసంగాలు చాలా వున్నాయి అవి పూర్వపక్ష సిద్ధాంతాలు చేసుకొనేటప్పుడు ప్రతివారి వ్రాఁతలలోనున్నూ అంతో యింతో వుంటూనే వుంటాయి కనక వాట్లని గూర్చి వ్రాయవలసిందిలేదు. గార్లపురాణం అంతవసరం లేకపోయినా నాజ్ఞాపకశక్తిని తెల్పడానికి వుటంకించాను.