పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

538

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మేము వారి విమర్శనము నభినందించినట్లిందు లేశమును లేదు. ఇది చరిత్రకుపకరించు ధోరణి, యీ వ్రాతనేగాక వ్రాసిన వారింగూడ నే నభినందించుచున్నాను. శిష్ట్లా వారివాక్యమునకే నాకు సమన్వయము కుదురకున్నది. వారి వాక్యము కూడా వుదాహరిస్తే బాగుండునుగాని ఆ పత్రిక యిప్పడెక్కడుందో వెతకాలి. నేను దాన్ని బెజవాడలో కాఁబోలును చదివినాను. అయితే శిష్ట్లావారి ఉద్దేశమందేమేనా దోషముండి అట్లనియుందురా! శివ! శివా! అదికేవల మసోహ. విమర్శకుఁడుగారి గౌరవార్ధము వారట్లుటంకించి యుందురు. అంతేకాని విమర్శకుఁడుగారు ఆసమయంలోనేమి? లోఁగడ వుదాహరించిన స్వాగతము నందలి వాక్యశ్రవణ సమయంలో నేమి? కొంత కలగఁజేసికొని తి. వెం. కవులద్వారా నాకు గౌరవం రావడమేమిటి? “యిది నాకు బొత్తిగా అవమానంగా వుండే పద్ధతి" వారు శుద్ధతెల్వితక్కువవారు. పనికిమాలిన వ్రాఁతలు వ్రాయువారు, అందుచేత తద్వారా నా గౌరవాన్ని ప్రకటించడం నాకు బొత్తిగా యిష్టంలేదని చెప్పవలసింది. ప్రస్తుతం ప్రాస్తూవున్న"సంశయవిచ్ఛేద" వ్యాసం చాలాభాగం జాగ్రత్తగానే విమర్శకుఁడుగారు వ్రాస్తూన్నారు కాని కొద్దిగా తొందరపాటు మాటలు యిందులోనూ లేకపోలేదు. చూడండి యీవాక్యాన్ని

"అట్లు కాదేని శాస్త్రి (వెం. శా.) గారి తెల్వితక్కువ యనవలసివచ్చును."

యిప్పటి వ్యాసంలో యింతకు మించిన తుందుడుకు మాటలున్నట్టులేదు. యిది స్థూలదృష్టిని వ్రాసినమాట. యీ వ్యాసంలో పూర్వం నాకెప్పుడు పెట్టని “గార్లూ, బూర్లూ" కూడ పెట్టడమేకాక, నాపేరుకు మొదట శ్రీకూడా తగల్చడాన్ని గూర్చి నేను వాటి సమన్వయాన్ని యీ విధంగా చేసుకుంటూవున్నాను. యేలాగంటే తిట్లుతిట్టి వ్రాసేగ్రంథరచన నాఁటికి విమర్శకుఁడుగారికిన్నీ, నాకున్నూ యేవిధమైన సంబంధ బాంధవ్యాలున్నూ యేర్పాటు కాలేదుకనక ఆలా నిరాఘాటంగా చేతికి వచ్చినట్లల్లా యేకవచనపు వషట్కారాలతో తిట్టఁగలిగారనిన్నీ యిటీవల కృతియివ్వడం ద్వారా నేను శ్రీ తిక్కన సోమయాజిగారి “క. నే నిన్ను మామయనియెద దానికిఁ గాఁ గావ్యకన్య" అనే పద్యం చొప్పున అల్లుణ్ణి అవడం తటస్థించడంచేత 70యేళ్ల బాలప్రాయంలోవున్న అల్లుణ్ణి మన్నిస్తేగాని బాగుండదని “గార్లు" పెట్టి విందుచేశారని సమన్వయించుకున్నాను. అయితే ఆబ్దికంలో భోక్తలికిపెట్టే పిండివంట గార్లేమిటి? మంగళప్రదమైనపిండివంటలు యేబొబ్బట్లో పెడితే యుక్తంగా యుండేవి, అని కొందఱనుకోవచ్చుగాని "దశాహం ముతైదువుగా" నన్ను పేర్కొనడమే కాకుండా యింకోపద్యంలో “క్ర, ఇద్దఱు భోక్తల కెక్కువె? తద్దినము" అంటూ మా సీమ గ్రంథంలోవున్న - "ఒకరి పెండిలిలో అనే పద్యంలో వున్న శుభప్రదమైన