పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

537

పైగా భగవదనుగ్రహం బాగావుంటే కొలదివత్సరాలలో విమర్శకుడుగారు సహస్రమాసజీవులు పొందదగ్గ బిరుదం, భగవత్స్వరూపులు అనేది నిన్ననేడు వారివారి సభ్యులు మమ్ము కసిదీర తిట్టి ప్రచురించిన గ్రంథరచనాన్ని కూడా యితర సంశయవిచ్ఛేదాలతో సంపుటీకరించి యిచ్చిన “1. కవిశేఖర, 2. అభినవతిక్కయజ్వ" లోనైన బిరుదావళితోసహాధరించే మంచిసమయం రాబోతుంది అట్టి భవిష్యద్భగవదవతార మూర్తుల చేతితోనేనా "దశాహంనాఁడు గొఱిగించుకొన్న ముత్తైదువు"లు అసకృదావృత్తిగా చిత్రించఁ బడవలసిందంటాను? యింతకు వెంకటశాస్త్రిగాఁడు ఆ అవతారమూర్తులపట్ల చేసిన అపచారం యేమిటో? నన్నయ్యను పురాణాలు తెలిగించినవారిలో చేర్చి గౌరవించడంకన్న అపచారం యేమి కావాలి? ఆయీ తిట్లేకాదు. శంకలుకూడా తిట్లలాగే వుంటాయి. వుంటాయేమిటి వున్నాయి. శంకలేతిట్లు, తిట్టులే శంకలు. శ్లో "త్వమేవాహం త్వమేవాహం” “ముత్తెదు" వల్లా వుండఁగా, పంద, వెంగలి, ఎట్సెట్రాలు, చూపేదేమిటి? "ఇట్టి రోఁతలకు మెచ్చు సూరులను నిన్ను ననియతాత్ము జేసినవిధి నందుఁగాక,” అని విమర్శకులు వ్రాసిన పరితాపవాక్యాన్ని చూచికూడా శ్రీశిష్ట్లాశాస్త్రులవారు నాకుప్రష్టవ్యులైనారు. తి. వెం. కవులు తమమీఁద వీరు వ్రాసిన విమర్శనాన్ని మెచ్చుకొన్నట్లు వుటంకించి వీరిని ప్రశంస చేశారు. వీరు యిలా అనడానికి వారికి ఆధారం ఏమిటోకదా! నేను నన్నయ్య వ్యాసంలో వీరి కవితాధారను అభినందనీయమని అన్నాను. దానికే సేల్జోడు బహుమతి అన్నాను. విమర్శనం అద్దాన్నమే అని వ్యంగ్యంగా కాదు వాచ్యంగానే అన్నాను. అంతకు మున్ను వీరి స్నేహితులకు వ్రాసిన కార్డులో వీరిభారత సంశయ విచ్ఛేదాన్ని అర్ధజరతీన్యాయంగా, అభివంతనీయమన్నట్టు కొంత తేలుతుంది అంతే. విమర్శన గ్రంథాన్ని అభినంద్యంగా వ్రాయలేదే? అట్టిస్థితిలో శ్రీ శిష్ట్లాశాస్త్రులు వారు నేనభినందించినట్టివారి (విమర్శకుడుగారికి సంబంధించిన) పొగడ్తలో ఆమాట యేలా వుటంకించి వున్నారు? అని నాకు సందేహం. యీ సందేహము తీర్చతగ్గదే అయి వారిని అడగడానికి తగ్గంత అర్హత నాకువున్నట్టు వారి చిత్తానికితోస్తే వారు నాకేదో ప్రత్యుత్తరాన్ని అనుగ్రహించనే అనుగ్రహిస్తారు. లేదా? అప్పుడు అంతపాటి అర్హత నాకులేదు కాఁబోలును అని నాలో నేనే లజ్జించి తలవంచుకుంటాను (వారు యేదేనా వ్రాయదలంచుకుంటే పత్రికలో వ్రాయాలిగాని నాకు వుత్తరం వ్రాయరాదు). యిది బొత్తిగా అసంబద్ధంగా వుందిగాని మావిమర్శకుఁడుగారికి వారివూరి (ధూళిపూడి) వారు సమర్పించిన స్వాగతంలో వుటంకించిన అక్కరముల ధోరణి కడుంగడుc జక్కఁగా నున్నది. వుదాహరించి చూపుదునా, “విమర్శకాగ్రణీ! విమర్శచేయుపట్ల మీకలము ఖడ్గమునకే యుద్ది దానిని ఝళిపించి కవిసింహములగు తిరుపతి కవులనే తాఁకితిరి" ఈ వాక్యమెంతో సమంజసముగా నున్నది.