పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

536

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అంతో యింతో ప్రసరింపచేస్తూనే వుంది భగవతి. బహుశః విస్తారంగా మీ పత్రికకు పని కల్పనకాదే అనుకుంటాను. ఆ బ్రాహ్మడు తిట్టినతిట్లకు తగినంత సమర్ధనం ఆయన చూపడమంటూ వుండదు. అలా చూపడమే తటస్థిస్తే “వింధ్యః ప్లవే త్సాగరే". ఆపద్ధతిని అంతతో "భాషామంజరీ సమాప్తా" కావలసే వస్తుందిగదా? ఆయనికి నామీద వున్న కోపానికి పరిమితే కనపడదు. నామీద కోపం అంతతో ఆగక నన్నయ్యమీదికికూడా ప్రసరించింది. నాకేమో? నన్నయ్య సమాస గ్రథనఫక్కి భారతకవులు తక్కిన యిద్దఱిలోనే కాదు యిటీవలకవులలో గూడా మృగ్యమని వక అభిప్రాయంవుంది. యిది తప్పుటభిప్రాయమైనా కావచ్చును. దీనికోసమే అయితే అన్నితిట్లు “దశాహం (దిక్కుమాలిన దశాహం) నాఁడు గొఱిగించుకొన్న ముత్తైదువు"నఁట నేను. యేమి కర్మం. పాపం ఆబ్రాహ్మడికి యీలాటి సదూహ కలిగింది? వకవేళ మేము యెప్పడేనా ఆయన్ని యేమేనా అనేవున్నామేమో? మఱచినామేమో? అంటే పాపం, ఆగ్రంథంలో ఆలాటి అభూతంగా వుండేకల్పన యేమీ చేసినట్టులేదు. దీనికి ఆయన్ని అభినందించవలసివుంది. మా మొదటి తప్పల్లా ఆయన పట్టుకున్నతప్పు

“క. ఎన్ని పురాణమ్ములఁ దా
     మన్నిటి నాంద్రీకరించి అనుకంపన్ గా
     కున్నన్ దీనిన్ విడుతురె?
     నన్నయభట్టాది కవిజనంబులు మాకున్.”

అనే పద్యంలో "నన్నయభట్టాది" అనేపదం దగ్గిఱే వుంది. నన్నయభట్టు భారతం వ్రాస్తూ వ్రాస్తూ అరణ్యపర్వం ముగియకుండానే చచ్చుకున్నాడు గదా? అట్టిస్థితిలో అతణ్ణి అంత గొప్పచేసి యెత్తుకోవడం యెందుకు? ఇదంతా వెంకటశాస్త్రి దురభిమాన ప్రయుక్తంగాని వేఱుకాదు. (యింతతో సరిపెడితే చింతలేదు. దశాహంనాటి ముత్తైదువులెందుకో? మీబోట్లు కనుక్కోవాలి) అంటూ తిట్లకు వుపక్రమించడంచూస్తే శోచ్యావస్థలోవున్న ఆ వ్రాతకు ఆశ్చర్యమేకాదు. విచారంకూడా కలుగుతుంది. యెందుకు విచారం నన్నుతిట్టినందుకనుకుంటూ వున్నారా? అలా మీరు అనుకోనూ అనుకోరు. అందుకు నేను అలా వ్రాయనూలేదు. నాకు 70 వత్సరాల వయస్సుగాని ఆయనకు 76 వత్సరాల వయస్సని వారివూరి బ్రాహ్మడే వకాయన యీ మధ్య తెనాలి రైలులో నాకు కనపడి చెప్పివున్నాడు. ఆయీ విమర్శన గ్రంథం (బూతులబుంగ) అచ్చై వకసంవత్సరం లోపు కనక దీని ప్రచురణం 75 వత్సరాల ప్రాయంలో జరిగివుండాలి. యేమీ చదువుకోని వాళ్లక్కూడా వృద్ధత్వం కొంత వివేకాన్ని కలిగిస్తూందంటారు. యీయన సాక్షులు గదా?