పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/531

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“శుభస్యశీఘ్రమ్”

535


యిప్పుడు అది తాము చూచామని నాకు ప్రత్యుత్తరం వ్రాసేదాకా పూర్తినిద్దురేపట్టదు. ఆపత్రికల తేదీలు ప్రకృతం విమర్శకుఁడుగారు మీ పత్రికలో వ్రాస్తూవున్న “సంశయావచ్ఛేదకావచ్ఛిన్నం"లో వుదాహరించే వున్నారు (నాకు కలిగిన సంశయ మేమిటో? విమర్శకుఁడుగారు ఛేదించేదేమిటో? నాకు బోధపడడంలేదు. అంత ప్రజ్ఞాశాలులేమి, కావచ్చు). ఆ తేదీలుగల పత్రికలు పంపవలసిందంటే కృష్ణాపత్రికవారు తమకు పంపకపోరు. లేదా? నావద్ద వకటే ప్రతివుంది. దాన్నే పంపవలసిందంటే పంపుతాను. లేదా విమర్శకుఁడుగారు అలాటితిట్లను వుపయోగించిన "తిరుపతివేంకట కవుల గ్రంథవిమర్శనం" అనే (రు 1-0–0 వెలగల) గ్రంథాన్ని తమకు పంపవలసిందంటే పంపకపోరని తలుస్తాను. ఇందులో యేదో వక పనిచేసి తాము ఆతిట్లు చూడాలి. అయితే ఆయన్ని మీరెప్పుడేనా యేపల్లెత్తు మాటేనా అన్నారేమో? అందుచేత ఆయనికి మిమ్మల్ని అలా (కృతేతు ప్రతి కర్తవ్యం) గాఢంగా తిట్టి బుద్ధి చెప్పవలసివచ్చిందంటారేమో? రామ రామా! ఆయనకీ మాకూ యెన్నడూ యేవిధమైన సంబంధమూలేదు. వొకరిమొగం వకరం చూచి యెఱుగం. (అయమయమితి ప్రత్యభిజ్ఞగా) యెఱుగనే యెఱుగం. రెండేళ్లనాడు కాcబోలు “గ్రామం గచ్ఛన్ తృణం స్పృశతి"గా మావూరు వచ్చి నన్ను చూచినట్లు వీరిస్నేహితులు నాపేర యిటీవల వ్రాశారు. యీ తిట్లు చాలాకాలంనాఁటివి. కాఁబట్టి యిది నిష్కారణవైరం. “పండితా పండితానాం” అంటూయేకరువు పెట్టివున్నారు అభియుక్తులు. ఆయనమహాపండితులు. ఆకారణంచేత తరపేక్షయా శుంఠతావచ్ఛుదక కోటిలో పరిగణింపవలసిన మేము ద్వేష్యులం కావలసి వచ్చిందేమో? ఆ తిట్లు చూచి తాము వారిని ప్రశ్నిస్తే వారే తమకు తోcచిన సమాధానం సెలవిస్తారు. మిమ్మల్ని యెందుకు యింత నిర్బంధిస్తానంటే? పత్రికా సంపాదకులకు వ్యాసకర్తల తత్త్వం తెలియడంకూడా అవసరమనియేను. చిరకాలాన్నుంచి నాకున్నూ మీకున్నూపరిచయంవుందికాని- “ఎన్నఁడు నినుఁ బెట్టుమనుచు నీండ్రము సేయన్” అన్నాడు భాగవతంలో, యెప్పుడూ మిమ్మల్ని యేమీ నేను స్వార్థంకోరలేదు. యిప్పుడు కోరుతూ వున్నాను. తీరిస్తే యీకోరిక తీఱ్చండి. లేదా? చింతలేదు. యాచ్న గదా!

“అవమానం పురస్కృత్య మానం కృత్వాతు పృష్ఠతః" అన్నారు అభియుక్తులు (మీరూ, మీరూ యేవో కలహాలు పెట్టుకుంటూ వుంటే మేమూ మేమూ కలిగించుకుంటూ వుంటామా? అంటారనిన్నీ యెఱుగుదును. యీ కలహం నిష్కారణంగా తిట్టడంగదా). నాకు తమసహాయమల్లా వ్రాయక వ్రాయక “జన్మానికల్లా శివరాత్రి"గా మీ పత్రికకు వ్రాస్తూ వున్న నా దీర్ఘ వ్యాసాలు (ప్రస్తుతానికి సంబంధించినవి మాత్రమే) మీ పత్రికలో జాగ్రత్తగా ప్రచురించడమే కావలసింది. వుండడం ప్రాయోపవేశావస్థలోవున్నా బుద్ధి యింకా